టిఎల్ సిఎ సాహితీ సదస్సు
న్యూయార్క్ : డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ, డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య, చిట్టినేని లక్ష్మీనారాయణ లాంటి సాహిత్య, సాంస్కృతిక రంగ ప్రముఖులతో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్ సిఎ) నిర్వహించిన సాహిత్య, సంస్కృతిక సదస్సు అందరినీ ఆకట్టుకుంది. న్యూయార్క్ నగరంలోని ఫ్లషంగ్ వద్ద ఉన్న హిందూ దేవాలయంలో జూలై 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు స్వాగతం పలికి ప్రారంభోపన్యాసం చేసిన టిఎల్ సిఎ అధ్యక్షుడు వెంకటేశ్ ముత్యాల మాట్లాడుతూ, అక్కిరాజు, లక్ష్మయ్య, లక్ష్మీనారాయణ లాంటి ఉద్దండులతో సదస్సు నిర్వహిడం తమ సంస్థ భాగ్యంగా భావిస్తున్నానన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో వీరంతా లబ్ధ ప్రతిష్టులని కొనియాడారు.
సముద్రాల లక్ష్మయ్య గురించి రఘువర్మ టూకీగా వివరించారు. అన్నమయ్య కీర్తనల్లో లక్ష్మయ్య చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. సంస్కృతంలో ఉన్న కీర్తనలను భావం చెడకుండా తెలుగు భాషలోకి అనువదించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణను తిరుమలరావు తిపిర్నేని సభకు పరిచయం చేశారు. అక్కిరాజు కేవలం కవి మాత్రమే కాదని, రచయితగా, నటుడిగా కూడా వన్నెకెక్కారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కిరాజు పలు అవార్డులు అందుకున్నారని వివరించారు. ఆధునిక తెలుగు పద్యాలను సుందర రామకృష్ణ శ్రావ్యంగా పడి ప్రేక్షకులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు. దివంగత ఎన్టీ రామారావు డైలాగ్ డెలివరీ గురించి ముఖ్యంగా కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు తదితర చారిత్రక సినిమాల్లో ఆయన చెప్పిన సంభాషణల సౌందర్యాన్ని సవివరంగా తెలిపారు. భారతీయ సినిమాలో ఎన్టీఆర్ తనకు తానే సాటి అని కొనియాడారు. అలాగే అమర గాయకుడు ఘంటసాలకు ఈ సందర్భంగా సుందర రామకృష్ణ నివాళులు అర్పించారు.
లక్ష్మీనారాయణను టిఎల్ సిఎ అధ్యక్షుడు వెంకటేశ్ ముత్యాల సభకు పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రపై లక్ష్మీనారాయణ డాక్యుమెంటరీ రూపొందించారని వెల్లడించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ చరిత్రపై తాను రాసిన పద్యాన్ని వినిపించారు. టిఎల్ సిఎ ఉపాధ్యక్షుడు శ్రీనాథ్ జొన్నవిత్తుల వందన సమర్పణతో సాహిత్య, సాంస్కృతిక సదస్సు విజయవంతంగా ముగిసింది.
News Posted: 30 July, 2009
|