వాషింగ్టన్ : నల్లజాతీయుల దాడిలో గత మే నెల 17న గాయపడి అలబామా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం.ఎస్. విద్యార్థి కడియాల మురళీకృష్ణకు తానా తరఫున 5 వేల డాలర్లు ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ విషయం తానా అధ్యక్షుడు కోమటి జయరాం మీడియాకు తెలిపారు. ఈ సహాయాన్ని చెక్కు రూపంలో మురళీకృష్ణకు తానా ట్రస్టీ యార్లగడ్డ వెంకట రమణ గురువారం అందజేసినట్లు ఆయన తెలిపారు.
గల్ఫ్ పోర్టు సిటీలోని ఒక గ్యాస్ స్టేషన్ లో మురళీకృష్ణ పనిచేస్తూ ఉండగా గ్యాస్ స్టేషన్ కు అనుబంధంగా ఉన్న షాపులోకి నల్ల జాతీయుడు చొరబడి బీరు కేసు ఎత్తుకుని పారిపోతుండగా మురళీకృష్ణ అతడిని వెంబడించాడు. ఈ సందర్భంగా మురళీకృష్ణ చొక్కా అతని కారు డోరులో ఇరుక్కుపోయింది. కారును ఆగంతకుడు అతి వేగంగా నడపటంతో మురళీకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఒక కాలిపై చర్మం పూర్తిగా ఊడిపోయింది. మురళీకృష్ణ చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు అవసరం కావటంతో తానా ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. తనకు ఆర్థిక సహాయం అందించిన తానా కార్యవర్గ సభ్యులకు మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపాడు.