రామినేని ఫౌండేషన్ అవార్డులు సిన్సినాటి : అమెరికాలోని ప్రముఖ ప్రవాసాంధ్ర ఫౌండేషన్ డాక్టర్ రామినేని ఫౌండేషన్ గత పదేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలోని పలువురు విశిష్ట వ్యక్తులను అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫౌండేషన్ పదకొండవ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధానీ నగరం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీలు రామినేని ధర్మప్రచారక్, వేదాచార్య వెల్లడించారు. అవార్డుల ప్రదానాన్ని ఈ సంవత్సరం నుంచి మరింతగా విస్తరిస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న ఒక విశిష్ట వ్యక్తికి లక్ష రూపాయలు, ముగ్గురు విశేష వ్యక్తులు ఒక్కొకరికి 75 వేల రూపాయలు చొప్పున తమ ఫౌండేషన్ నుంచి అవార్డుగా అందజేయనున్నట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో గత పదేళ్లుగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు, జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్ధానాలు సాధించిన విద్యార్ధులకు, నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒక్కొక్కరికీ ఐదు వేల రూపాయలు చొప్పున అందజేయనున్నామని ధర్మప్రచారక్, వేదాచార్య తెలిపారు. అవార్డు గ్రహీతల జాబితాను, వారి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు.
News Posted: 11 August, 2009
|