బే ఏరియాలో 'ఐ డే'

కాలిఫోర్నియా : భారత స్వాతంత్ర్య ఉత్సవాన్ని సింఫనీ సంస్థ బే ఏరియాలో ఘనంగా నిర్వహించింది. ఆగస్టు 14 నుంచి 16 వ తేదీ మధ్య కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో వైభవంగా జరిగిన ఈ ఉత్సవాలను పలువురు అమెరికా సెనెటర్లు, సిటీ కౌన్సిల్ సభ్యులు, ఇండో - అమెరికన్ చార్టర్లు, ఎన్నారైలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ ను, 'సారే జహాఁ సె అచ్చా' పేరున అద్భుతమైన సంగీత, నృత్య రూపకాన్ని సింఫనీ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండో - అమెరికన్స్ సంస్థ నిర్వహించింది. ఈ ఉత్సవాలకు అమెరికా వ్యాప్తంగాను, కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి 12 వేల మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలకు హాజరైన వారిలో కాలిఫోర్నియా నగరానికి, రాష్ట్రానికి చెందిన అధికారులు స్టేట్ సెనెటర్ ఎలెన్ కార్బెట్, శాన్ జోష్ నగరం కౌన్సిల్ సభ్యుడు ఆశ్ కల్రా, బాలీవుడ్ నటీమణి నేహా ధూపియా, బాలీవుడ్ గాయకుడు మౌలీ దవే తదితర ప్రముఖులు ఉన్నారు. సారే జహాఁ సె అచ్చా కార్యక్రమాన్ని ఉత్సాహంతో కూడిన ప్రతిభావంతులైన పలువురు ప్రవాస భారతీయులు ప్రదర్శించారు.

'సారే జహాఁ సె అచ్చా' కార్యక్రమాన్ని సింఫనీ సంస్థకు చెందిన సైచుక్ రూపొందించారు. మానసా రావు నృత్య దర్శకత్వం వహించారు. మాధవి కడియాల సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమానికి శైలీల్ విజయ్ కర్ ఇన్ చార్జి బాధ్యతలు వహించారు. శ్రీనివాస మానాప్రగడ ప్రదర్శనను సమన్వయం చేశారు. ఈవెంట్ మేనేజర్ గా దినేష్ పాడేర్, అనిల్ అన్నం ప్రోగ్రాం మేనేజర్ గా వ్యవహరించారు. 'సారే జహాఁ అచ్చా' సాంస్కృతిక ప్రదర్శనకు ఆహూతుల నుంచి విశేష స్పందన, అభినందనలు లభించాయి.

ఈ కార్యక్రమంలో భాగంగానే సింఫనీ సంస్థ మొట్టమొదటి యత్నంగా సైచుక్ రూపొందించిన సోలో సిడి ఆల్బమ్ 'ది రఫ్తార్'ను స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ కు గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించిన బాలీవుడ్ నటీమణి నేహా ధూపియా ఆవిష్కరించారు. సిడి తొలి కాపీని ఆశ్ కల్రా, ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆఫ్ నార్దర్న్ కాలిఫోర్నియా (ఎఫ్ ఐ ఎ) చైర్మన్ డాక్టర్ రొమేష్ ఝాప్ర, మౌలీ దవే, తానా ప్రెసిడెంట్ జయరామ్ కోమటి, ఎఫ్ ఐ ఎ సభ్యులు విజయ్ ఆసురి, వీరు వుప్పలకు అందించారు.
News Posted: 19 August, 2009
|