చవితి రోజు చిరు బర్త్ డే

కాలిఫోర్నియా : ప్రజారాజ్యం పార్టీ అధినేత పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి 54వ పుట్టిన రోజు వేడుకలను మిల్పిటాస్ లోని సీరా థియేటర్స్ లో ఘనంగా జరిగాయి. ఆగస్టు 23 వినాయక చవితి పర్వదినం రోజున ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్, ఎన్నారై ప్రజారాజ్య పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సీరా థియేటర్స్ యాజమాన్యం ఆతిథ్యం ఇచ్చింది. ఎన్నారైలు, మిత్రులు, చిరంజీవి శ్రేయోభిలాషులు, అభిమానులు ఈ వేడుకలకు అత్యధిక సంఖ్యలో ఉత్సాహంగా హాజరయ్యారు.
ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ స్వాగతంతో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన సూపర్ హిట్ అయిన 'మగధీర' చిత్రాన్ని ఆహూతుల కోసం ప్రదర్శించారు. తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ప్రవాసాంధ్రులు థియేటర్ లో కాంప్లిమెంట్ గా అందజేసిన చిరంజీవి టీ షర్ట్ లు ధరించి ఉత్సాహంగా బయటికి వచ్చారు. కోడిగుడ్డు లేకుండా ప్రత్యేకంగా తయారుచేయించిన కేక్ ను చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా చిన్నారులు కట్ చేశారు. వినాయక చవితి కారణంగా కోడిగుడ్డు లేకుండా ఈ కేక్ ను తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా తమ అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు చిరంజీవి ప్రతి ఒక్కరూ జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. మగధీరుడు రామ్ చరణ్ తేజకు, చిత్రం యూనిట్ కు అభినందనలు చెప్పారు. శ్రీకాంత్ పలివెల, రామ్ తోట, వీరబాబు ప్రత్తిపాటి, రెడ్డియ్య ప్రత్తిపాటి, చంద్రు శీలం, శేఖర్ గంజి, బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) అధ్యక్షుడు ప్రసాద్ మంగిన, ప్రజారాజ్యం పార్టీకి బలీయంగా మద్దతు ఇస్తున్న ప్రవాసాంధ్రులు శ్రీని చిమట, పరుచూరి కృష్ణ, గోకుల్, కిషోర్, హేమాద్రి, కూమార్ విడదల, రమణ్ తదిరులతో కలిసి జన్మభూమికి సేవచేస్తామని, చిరంజీవికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని ప్రమాణం చేశారు.
ఈ వేడుకలకు చక్కని సహాయ సహకారాలు అందించిన సీరా థియేటర్స్ యాజమాన్యానికి, మగధీర చిత్రానికి అమెరికాలో సోలో డిస్ట్రిబ్యూటర్ బాధ్యతలు చేపట్టిన బ్లూ స్కై సినిమా యాజమాన్యానికి ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ నరసయ్య వడ్రాణం, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస మానాప్రగడ, ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ కల్యాణ్ పల్లా, ప్రజా సంబంధాల ఇన్ చార్జి శ్రీకాంత్ పలివెల, మహిళా విభాగం (వరల్డ్ వింగ్) కో ఆర్డినేటర్ రజిని ఆకురాతి, శివ వెజ్జు, ఎన్నారై పిఆర్పీ వరల్డ్ విభాగం ప్రెసిడెంట్ వెంకట్ సంజీవ్, ప్రధాన కార్యదర్శి రఘువీర్ బండి ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 25 August, 2009
|