'ఆశా జ్యోతి' 5కె రన్ వర్జీనియా : భారత సంతతికి చెందిన నిరుపేద బాల బాలికల్లో విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాల నిర్వహణ కోసం నిధుల సేకరించేందుకు పెద్దలకు 5కె రన్, చిన్నారులకు ఒక మైలు దూరం పరుగు పోటీ నిర్వహిస్తున్నట్లు ఆశా జ్యోతి స్వచ్ఛంద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదాత్తమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా చేయూత అందించాలని సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమం గురించి తమ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేసి ప్రచారం కల్పించాలని ఆశా జ్యోతి సంస్థ తన ప్రకటనలో కోరింది.
సెప్టెంబర్ 26 శనివారం ఉదయం 8 గంటలకు 5కె రన్, 8.30కు చిన్నారులకు ఒక మైలు పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు ఆశా జ్యోతి సంస్థ వివరించింది. వర్జీనియాలోని ఫైర్ ఫాక్స్ ప్రాంతంలోని ఫైర్ ఫాక్స్ కార్నర్ నుంచి 5కె రన్ ప్రారంభం అవుతుంది. 5కె రన్ లో పాల్గొనే ఉత్సాహవంతులు సెప్టెంబర్ 25కు వరకూ రిజిస్ట్రేషన్ ఫీజుగా 20 డాలర్లు, 26న రన్ ప్రారంభానికి ముందు వరకూ అయితే 25 డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది. ఒక మైలు పరుగు పందెంలో పాల్గొనే చిన్నారులైతే 10 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. 5కె రన్ లో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారు సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం 4 - 8 గంటల మధ్య వర్జీనియాలోని ఫైర్ ఫాక్స్ ప్రాంతంలోని 'డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్'లో తమ తమ ప్యాకెట్ లను తీసుకొని వెళ్ళవచ్చు. 5కె రన్ జరిగే రోజు సెప్టెంబర్ 26 ఉదయం 6 - 7 గంటల మధ్య కూడా తమ ప్యాకెట్ లు తీసుకోవచ్చు. పేర్లను ఆన్ లైన్ లో http://asha-jyothi.org/ashajyoghi/ajrun/ లో నమోదు చేసుకోవచ్చు. మెయిల్ ద్వారా గాని, ఫ్యాక్స్ ద్వారా గాని తమ పేర్లను నమోదు చేయదలచుకున్న వారు రిజిస్ట్రేషన్ ఫారాన్ని http://www.asha-jyothi.org వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా స్వయంగా వచ్చి పేర్లను నమోదు చేసుకోవాలనుకుంటే 5కె రన్ జరిగే సెప్టెంబర్ 26న ఉదయం 7.30 గంటలకు రన్ మొదలయ్యే చోటకు వచ్చి నేరుగా నమోదు చేయించుకోవచ్చు. ఆశా జ్యోతి ఈ మెయిల్ అడ్రస్ : contactus@asha-jyothi.org.
ఆశా జ్యోతి స్వచ్ఛంద సంస్థ శేఖర్ పులి నాయకత్వంలో శ్రీధర్ వాసిరెడ్డి, హేమంత్ గంటా, నీలిమ బూరుగుపల్లి నిర్వహిస్తున్నారు. ఇతర వివరాలు తెలుసుకోవాలంటే నీలిమ బూరుగుపల్లిని ajmedia@asha-jyothi.org లో సంప్రతించవచ్చు.
News Posted: 28 August, 2009
|