వనితా వేదిక పోటీలు సక్సెస్

డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వనితా వేదిక శనివారంనాడు మహిళలకు వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీలకు చక్కని ప్రతిస్పందన లభించింది. సెప్టెంబర్ 19న వనితా వేదిక కార్యవర్గం మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించనున్న సదస్సుకు ముందు ఈ పోటీలను నిర్వహించారు. డల్లాస్ లోని ఫార్మర్స్ బ్రాంచ్ లైబ్రరీలో ఈ పోటీలు నిర్వహించారు.
'ప్రస్తుత సమాజంలో మహిళలు ఏం చేస్తే విజయం సాధించగలరు, దానిలో పురుష సహకారం ఎంతవరకూ ఉంది, పిల్లల పెంపకంలో తలెత్తే సమస్యలు - వాటికి పరిష్కారాలు' అనే అంశాలపై ముందుగా సవివరమైన చర్చ జరిగింది. ఉత్సాహవంతులైన సుమారు 40 మంది మహిళలు పాల్గొన్ని ఈ చర్చా వేదికలో వాడి వేడిగా చర్చ జరిగింది. ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను స్పష్టంగా పంచుకున్నారు. అనంతరం వంటల పోటీల్లో రుచి, పోషక పదార్థాలు, చేయడానికి పట్టే సమయం, సృజనాత్మకత అనే అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు.

పిమ్మట నిర్వహించిన వక్తృత్వ పోటీలో 'నేటి తరం స్త్రీలు సాధించిన ప్రగతి కారణంగా ముందు తరాల వారికన్నా ఎక్కువ ఆనందంగా ఉంటున్నారా?' అనే అంశంపై వక్తలు తమ తమ వాదనలను అద్భుతంగా వినిపించి ఆహూతులందరినీ రంజింపజేశారు. ఇక ఈ సందర్భంగా వనితా వేదిక నిర్వహించిన క్విజ్ పోటీలో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి క్విజ్ మాస్టర్ అడిగిన అనేక ప్రశ్నలకు పోటీదారులు సరైన సమాధానాలు చెప్పి బహుమతులు గెలుచుకున్నారు. తరువాత నిర్వహించిన ముగ్గుల పోటీ మహిళల్లోని సృజనాత్మకతను, కళాత్మక దృష్టిని వెలికి తీసుకువచ్చింది. కార్యక్రమంలో చివరిలో ఆటల పోటీ జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని నిరూపించినట్లైంది. విజేతలందరికీ సెప్టెంబర్ 19న జరిగే వనితా వేదికలో బహుమతుల ప్రదానం జరుగుతుంది.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ వనితా వేదిక కార్యనిర్వాహక వర్గం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అతిథులకు 'అవర్ ప్లేస్' రెస్టారెంట్ యాజమాన్యం అల్పాహార విందు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 19న జరిగే వనితా వేదిక మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమానికి మరింత అధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని టాన్ టెక్స్ వనితా వేదిక ఆహ్వానించింది.
News Posted: 1 September, 2009
|