వాషింగ్టన్ : ఓహియో రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 22 సంవత్సరాల విద్యార్థి మరణించాడు. రైట్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్. (ఈఈ) మొదటి సంవత్సరం చదువుతున్న నరేష్ దాచ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే అసువులు బాసాడు. అతనితో పాటు అదే కారులోని ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో ప్రయాణిస్తున్న మరో ఆంధ్ర విద్యార్థి వరుణ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారుకు అడ్డంగా వచ్చిన పిల్లిని డ్రైవర్ తప్పించేందుకు యత్నించాడు. దీనితో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నది. నరేష్ తన నివాసం నుంచి యూనివర్శిటీకి వెళ్తుండగా డేటన్ లోని రూట్ నెంబర్ 22లో ఈ ప్రమాదం సంభవించిందని తానా ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ప్రసాద్ తోటకూర తెలిపారు. కారు ప్రమాదంలో నరేష్ మరణించిన విషయాన్ని హైదరాబాద్ లో ఉంటున్న అతని తల్లిదండ్రులకు తెలియజేసినట్లు ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. నరేష్ మృతదేహాన్ని వీలైనంత తొందరగా హైదరాబాద్ పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువ విద్యార్థి ఇలా ఊహించని విధంగా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం అని తానా అధ్యక్షుడు జయరాం కోమటి విచారం వ్యక్తం చేశారు. నరేష్ మరణ వార్త విన్న ఆయన తండ్రి భాస్కర్ దాచ తీవ్ర షాక్ కు గురయ్యారని ఆయన తెలిపారు. తమ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు మృతదేహాన్ని హైదరాబాద్ పంపించాల్సిందిగా భాస్కర్ దాచ కన్నీళ్ళతో తమకు విజ్ఞప్తి చేసినట్లు జయరామ్ కోమటి తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో 2008లో బిటెక్ పూర్తిచేసిన నరేష్ 2009 జనవరిలో రైట్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ కోర్సులో చేరాడని జయరామ్ కోమటి వెల్లడించారు.