'వైఎస్ క్షేమంగా ఉండాలి' షికాగో : హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు వెళుతూ అదృశ్యం అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ప్రార్థనలు చేద్దామంటూ షికాగోలో ప్రముఖ ప్రవాస భారతీయుడు ఇఫ్తెకార్ షరీఫ్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండాపోయిన వార్త విన్న వెంటనే షరీఫ్ పై విధంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి క్షేమంగా ఉండాలంటూ ఆయన ఆకాంక్షించారు.
జనహృదయ నేత, ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఆంధ్రులతో ప్రవాస భారతీయులందరం మద్దతుగా ఉందామని, ఆయనకు ఎలాంటి ప్రమాదమూ సంభవించకూడదని దేవుని ప్రార్థిద్దాని ఇఫ్తెకార్ షరీఫ్ పిలుపునిచ్చారు. ప్రజానాయకుడైన వైఎస్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికుల అభిమానాన్ని చూరగొన్న ఏకైక నాయకుడని ఈ సందర్భంగా షరీఫ్ గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ కోసం ప్రభుత్వం, సైన్యం, ఎయిర్ ఫోర్స్, గ్రేహౌండ్స్, పోలీసులు, ప్రజలు, నాయకులు, మంత్రులు చేస్తున్న అవిశ్రాంత కృషి ఫలించాలని, ముఖ్యమంత్రి సురక్షితంగా, క్షేమంగా బయటపడాలని, వైఎస్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ముందుకు కొనసాగాలని షరీఫ్ ఆకాంక్షించారు.
News Posted: 3 September, 2009
|