టిసిఎ తీవ్ర సంతాపం వాషింగ్టన్ : హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందడంపై అమెరికాలోని తెలంగాణ కల్చలర్ అసోసియేషన్ (టిసిఎ) తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి మరణించిన వార్త బుధవారం ఉదయం మీడియాలో వచ్చిన వెంటనే టిసిఎ చైర్మన్ విజయ్ చవ్వ, ప్రెసిడెంట్ బిక్షం పాలబిందెల ఒక ప్రకటన విడుదల చేస్తూ వైఎస్ కుటుంబ సభ్యులకు, తెలుగు ప్రజలందరికీ తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. పేదల గుండెలను గెలిచిన ఏకైక 'చాంపియన్'గా వైఎస్ జనంహృదయంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని వారు తమ సంతాసందేశంలో పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన అత్యంత బలీయమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా వైఎస్ చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకున్నారని విజయ్ చవ్వ, బిక్షం పాలబిందెల నివాళులు అర్పించారు. విఐపిలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు, విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో కొన్ని కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు, విధివిధానాలు రూపొందించాలని భారత ప్రభుత్వానికి టిసిఎ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు దేవుడ్ని ప్రార్థించారు.
News Posted: 3 September, 2009
|