టిఎఫ్ఎఎస్ దిగ్భ్రాంతి న్యూజెర్సీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతి వార్త విన్న తామంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ప్రెసిడెంట్ దాము గేదల, టిఎఫ్ఎఎస్ కార్యనిర్వాహకవర్గ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని రుద్రకొండపై బుధవారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో ఆయనతో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పి. సుబ్రమణ్యం, సి.ఎం. ప్రధాన భద్రతాధికారి ఎఎస్ సి వెస్లీ, పైలెట్ భాటియా, కో పైలెట్ ఎం.ఎస్. రెడ్డి కూడా మరణించడం పట్ల టిఎఫ్ఎఎస్ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వైఎస్ మరణం, ఆంధ్రప్రదేశ్ కు, భారతదేశానికి పూడ్చలేని లోటు అని వారు సంతాపం ప్రకటించారు. వైఎస్సార్ మంచి రాజకీయవేత్త, ప్రజల మనిషి, తిరుగులేని నాయకుడని ఈ సందర్భంగా టిఎఫ్ఎఎస్ కమిటీ తన సంతాప సందేశంలో పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దాము గేదల, టిఎఫ్ఎఎస్ కమిటీ నివాళులు అర్పించింది.
News Posted: 4 September, 2009
|