'చిరస్మరణీయుడు వైఎస్' న్యూయార్క్ : నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి చిరస్మరణీయుడని ప్రవాసాంధ్రుడు వెంకట్ ఎక్కా ఒక ప్రకటనలో తెలిపారు. చిరు దరహాసంతో అందరినీ ఆప్యాయంగా పలుకరించే ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందడం తీరని ఆవేదనకు గురిచేస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. వైఎస్ మృతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకూ పూడ్చలేని లోటు అని ఆయన సంతాపం ప్రకటించారు. భారతదేశ చరిత్రలోనే రాష్ట్ర ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు నెలకొల్పుకొని, వారికి బాగు కోసం అహరహం శ్రమించిన వారిలో వైఎస్ మొట్టమొదటి నాయకుడని ఆయన ప్రశంసించారు.
స్నేహానికి పెద్ద పీట వేసి, విధేయతకు పట్టం కట్టిన విశాల హృదయం గలవారిలో వైఎస్ ఒకరని వెంకట్ ఎక్కా తన సంతాప ప్రకటనలో అభివర్ణించారు. ఏదైనా ఒక విషయం మీద వైఎస్ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటే ఇక ఎట్టి పరిస్థితుల్లోను తన అభిప్రాయాన్ని మార్చుకోని బలీయమైన దృఢచిత్తుడని ఆయన కొనియాడారు. ఎనలేని దూరదృష్టి గల ఇలాంటి నాయకుడిని ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం కోల్పోవడం నిజంగా దురదృష్టకరం అని వెంకట్ ఎక్కా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి మహా నాయకుడిని మళ్ళీ సంపాదించుకోవాలంటే ఏళ్ళూ పూళ్ళూ పడుతుందన్నారు.
ఈ సందర్భంగా తన చిన్నతనం నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డిని గమనించిన పలు అంశాలను వెంకట్ ఎక్కా పంచుకున్నారు. వైఎస్ రూపం, గుణగణాలు, వ్యవహారించే తీరు, సమస్యలపై ఆయన స్పందించే విధానం తదితర పలు విషయాలను ఈ సందర్భంగా ఆయన నెమరువేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి వైఎస్ చేసిన కృషిని, రూపొందించి, అమలు చేసిన పథకాల గురించి వెంకట్ ఎక్కా మననం చేసుకున్నారు.
జనహృదయం దోచుకున్న అభిమాన నాయకుడు, దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రజల్లో నిత్య స్మరణీయుడిగా ఆయన మిగిలిపోతారని, జనం గుండెల్లో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచిపోవాలని వెంకట్ తన సంతాప సందేశంలో ఎక్కా ఆకాంక్షించారు.
News Posted: 4 September, 2009
|