నాట్స్ తీవ్ర విచారం న్యూయార్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హైలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం పాలయ్యారన్న వార్తతో అమెరికాలోని తెలుగువారంతా దిగ్భ్రాంతికి గురయ్యారని నాట్స్ సంస్థ ఒక సంతాప ప్రకటనలో పేర్కొంది. భారత రాజకీయ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన మహానాయకుడు వైఎస్ అని నాట్స్ అభివర్ణించింది. ఆరుపదుల వయస్సులోనే ఇంత ప్రజామోదం పొందిన నాయకుడిని అకాలంగా మృత్యువు కబళించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు నాట్స్ సంస్థ విచారం వ్యక్తం చేసింది. వైఎస్ అకాల మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులు, సహచరులు, అనుయాయులు అందరికీ నాట్స్ తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేసింది. అలాగే వైఎస్ తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన ప్రత్యేక కార్యదర్శి పి.సుబ్రమణ్యం, సిఎం ప్రధాన భద్రతాధికారి ఎఎస్ సి వెస్లీ, పైలెట్ గ్రూప్ కెప్టెన్ ఎస్.కె. భాటియా, కో పైలెట్ ఎం.ఎస్. రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా నాట్స్ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది.
ఆంధ్ర రాష్ట్రంలోని రైతులు, నిరుపేదల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విశ్రాంతి లేకుండా కృషిచేశారని నాట్స్ తన సంతాప సందేశంలో పేర్కొంది. వైఎస్ మరణంతో రాష్ట్రాన్ని సరైన మార్గంలో దిశానిర్దేశం చేసి, నడిపించగల మహా నాయకుడిని భారతదేశం కోల్పోయిందని నాట్స్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ కు, దేశానికీ ఎంతకీ తీరని లోటు అని అభివర్ణించింది. దివంగత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్న ఆశాభావాన్ని నాట్స్ సంస్థ వ్యక్తం చేసింది.
News Posted: 4 September, 2009
|