సిటిఎ ఆవేదన బ్లూమింగ్ డేల్ (ఐఎల్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి అభివృద్ధికి అహరహం డైనమిక్ గా కృషి చేసిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించడం పట్ల షికాగో తెలుగు అసోసియేషన్ (సిటిఎ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సిటిఎ ప్రతినిధి రావు ఆచంట ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం, అన్నదాతలను ఆదుకునేందుకు, మహిళా సాధికారతకు, శిశు సంక్షేమానికి వైఎస్ చేసిన సేవలు ఎనలేనివని ఆ ప్రకటనలో రావు ఆచంట పేర్కొన్నారు. డైనమిక్ నాయకుడిగా, భవిష్యద్దర్శిగా, అభ్యుదయ వాదిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని శ్లాఘించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షికాగో తెలుగు అసోసియేషన్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేసింది. వైఎస్ మరణం తెలుగువారి గుండెల్లో చెప్పలేనంత శూన్యాన్ని నింపిందని, అయినప్పటికీ మన హృదయాల్లోనే ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడిగానే నిలిచి ఉంటారని సిటిఎ తన సంతాప సందేశంలో పేర్కొంది. వైఎస్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని సిటిఎ ప్రార్థిస్తున్నట్లు రావు ఆచంట తెలిపారు.
News Posted: 5 September, 2009
|