వైఎస్ పేరిట అన్నదానం

వాషింగ్టన్ : హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా అసువులు బాసిన ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ శాంతి కోసం వాషింగ్టన్ డిసి లోని క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (క్యాట్స్) 4 వేల మంది పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ ఫౌండర్ ట్రస్టీ మురళి బుక్కపట్నం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డిసి లోని డిసి సెంట్రల్ కిచెన్ లో క్యాట్స్ కు చెందిన 30 మందికి పైగా వలంటీర్లు పేదలకు అన్నదానం కోసం సెప్టెంబర్ 6 ఆదివారంనాడు భోజన పదార్ధాలను తయారు చేశారని ఆయన తెలిపారు. అన్నదానం చేయడమే నిరుపేదల అభ్యున్నతి కోసం అహరహం శ్రమించి, వారి గుండెల్లో చాంపియన్ గా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మనం ఇచ్చే సరైన నివాళి అని భావించిన క్యాట్స్ సంస్థ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఈ సందర్భంగా క్యాట్స్ సంస్థ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా క్యాట్స్ సంస్థ ఫౌండర్ ట్రస్టీ చిత్తరంజన్ నల్లు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఒక చైతన్యవంతుడైన, భవిష్యత్ దార్శనికుడు, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించగల సమర్థుడైన నాయకుడిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు, రైతుల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత, చిన్నారుల సంక్షేమం కోసం ఎంతగానో శ్రమించారని ఆయన నివాళులు అర్పించారు. వైఎస్ మృతితో ప్రవాసాంధ్రులు నిజమైన మిత్రుడ్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ సంస్మరణ సంతర్పణ కార్యక్రమంలో రామ్ మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు, రమేష్ అన్నంరెడ్డి, విజయ్ అన్నపరెడ్డి, గుండా రెడ్డి, జయప్రద వల్లూరిపల్లి, కృష్ణ బొప్పన, విజయ, జ్యోతి నల్లు, అను కొండా, భారతి, జానకి, క్యాట్స్ కార్యనిర్వాహకవర్గం కమిటీ సభ్యులు పాలుపంచుకున్నారు.
News Posted: 11 September, 2009
|