దక్షిణాసియా హెల్త్ ఫెయిర్ న్యూజెర్సీ : వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని దక్షిణాసియాకు చెందిన 18 నుంచి 45 ఏళ్ళ మధ్య వయస్సులో ఉన్న స్త్రీ, పురుషుల కోసం వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సౌత్ ఏసియన్ హెల్త్ క్యాంప్ అండ్ శాంపిలింగ్ కు చెందిన డాక్టర్ రావు అందవోలు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రౌన్స్విక్ లోని హామర్స్కోల్డ్ మిడిల్ స్కూల్ లో ఈ శిబిరాన్ని సెప్టెంబర్ 26 శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ శిబిరాన్ని న్యూజెర్సీలోని హోవెల్ కు చెందిన లాభాన్ని ఆశించని ధార్మిక సంస్థ 'సర్వ ధర్మ సర్వీస్ సెంటర్' నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ శిబిరంలో బ్లడ్ ప్రెషర్, బ్లడ్ సుగర్, కొలెస్టరాల్, దృష్టి, ఎముకల సాంధ్రతలపై ఉచిత పరీక్ష ఉంటుందని డాక్టర్ రావు తెలిపారు. ఈ శిబిరంలో తనిఖీ చేయించుకున్న ఆరోగ్య బీమా లేని వారికి కార్డియాలజీ, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు, ఎండో క్రినాలజిస్టులు, యూరాజిస్టులు లాంటి నిపుణులైన వైద్యుల చేత ఉచితంగా తనిఖీలు చేయించనున్నట్లు డాక్టర్ రావు తెలిపారు. ప్రిన్స్ టన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కు చెందిన వైద్యులు, సిబ్బంది 'సౌత్ ఏసియన్ హెల్త్ స్టడీ' నిర్వహిస్తారన్నారు. గుండె జబ్బులు, చక్కెర వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్ తదితర రోగాలపై నిపుణులైన వైద్యుల ప్రసంగాలు ఈ ఫెయిర్ లో ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రావు తెలిపారు. ఈ శిబిరంలో భాగంగానే భారత డైటీషియన్లతో 'హెల్దీ ఇండియన్ కుకింగ్ - ఎ మెడికల్ నీడ్' అనే అంశంపై చర్చా గోష్ఠి నిర్వహిస్తామన్నారు. కార్డియాలజిస్టులు, ఇంటర్నిస్టులు, ఇతర స్పెషలిస్టులతో రూపొందించిన కాన్ఫిడెన్షియల్ హెల్ప్ డెస్క్ ద్వారా 'ఆస్క్ ది డాక్టర్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ ఆరోగ్యంపై స్వయం తనిఖీ, అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ శిబిరానికి హాజరయ్యే వారికి ఎడ్యుకేషనల్ మెటీరియల్ ను ఆస్ట్రా జెనికా, జాన్సన్ అండ్ జాన్సన్, ఫిజర్, నోవర్టీస్, బోరింగర్ ఇన్జెలీమ్, ప్రోక్టార్ అండ్ గేంబిల్, మెర్క్ అండ్ కో, బ్రిస్టల్ మేయర్స స్క్విబ్, బాక్స్టర్ ఇంటర్నేషనల్, అబ్బాట్ లేబొరేటరీస్ తదితర ఔషధ తయారీ సంస్థలు ఉచితంగా అందజేస్తున్నట్లు డాక్టర్ రావు వివరించారు.
ఈ శిబిరానికి సంబంధించి మరిన్ని వివరాలు కావాల్సిన వారు టెలిఫోన్ (732) 993 - 6161లో గాని, ఈ మెయిల్ healthfair@sai-service.orgలో గాని సంప్రతించవచ్చు.
ఈ శిబిరంలో చేయించుకున్న పరీక్షల ఫలితాలు రహస్యంగా ఉంచుతారు. ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలకు హాజరయ్యేవారు ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా రావాల్సి ఉంటుంది. 26వ తేదీన ఉదయం 7.30 గంటల లోపే శిబిరం వద్దకు రావాలని, పరీక్షల కోసం నమూనాలు తీసుకున్న అనంతరం అల్పాహారాన్ని శిబిరం నిర్వాహకులే సరఫరా చేస్తారని ఆయన తెలిపారు. ఈ శిబిరానికి సంబంధించి ఏవైనా ప్రశ్నలుంటే డాక్టర్ రావు అందవోలును ఫోన్ నెంబర్ (609) 497 - 4359లో సంప్రతించవచ్చు.
ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహణకు ప్రిన్స్ టన్ హెల్త్ కేర్ సిస్టమ్స్, ఇండియన్ అమెరికన్ సివిక్ ఫోరమ్ నిధులు సమకూరుస్తున్నట్లు డాక్టర్ రావు అందవోలు తెలిపారు. ఈ శిబిరంలో పలు రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు.
News Posted: 14 September, 2009
|