20న టిసిఎ 'బతుకమ్మ' కాలిఫోర్నియా : అమెరికాలోని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతి ఏటా అత్యంత వైభవంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాన్ని ఈ నెల 20న నిర్వహించేందుకు ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయని ఆ సంస్థ చైర్మన్ విజయ్ చవ్వ, ప్రెసిడెంట్ బిక్షం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకూ కాలిఫోర్నియాలోని సన్నివేల్ ప్రాంతంలో ఉన్న ఇన్ ఆర్టెగా పార్కులో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు.
స్థానిక తెలుగు సంస్థలైన బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), సిలికానాంధ్ర సంస్థల సహాయ సహకారాలతో నిర్వహించనున్న ఈ సంబరాల్లో సన్నివేల్ మేయర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వారు తెలిపారు. ఈ పండుగను పురస్కరించుకొని పిల్లలు, యువతీ యువకులు, పెద్దలకు, సీనియర్ సిటిజన్లకు ఆ రోజంతా మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయని టిసిఎ చైర్మన్, ప్రెసిడెంటు వివరించారు. ఈ సందర్భంగా బతుకమ్మ జానపద నృత్యం, దాని తరువాత యువత బతుకమ్మ సాంస్కృతిక ప్రదర్శన ఉంటుందని వారు తెలిపారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనే పురుషులు సాంప్రదాయ దుస్తులను, మహిళలు పట్టుచీరలు, బాలికలు పట్టు పరికిణీలు, చిన్నారులు పట్టు వస్త్రాలు, పట్టు పంచెలు ధరించాలని నిర్వాహకులు వివరించారు. బతుకమ్మ పండుగలో పాల్గొన్న వారికి రాత్రికి ఉచిత భోజన వసతి కల్పించినట్లు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ చవ్వ, ప్రెసిడెంట్ బిక్షం తెలిపారు.
News Posted: 14 September, 2009
|