రైతుబంధు వైఎస్: 'గీత' ఇండియానా పోలిస్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇండియానా పోలిస్ చైర్మన్ డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి కొనియాడారు. ఈ నెల 2న కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టపై జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్ సంస్మరణార్థం 9వ తేదీన ఇండియానా పోలిస్ లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ ఇండియానా పోలిస్ తెలుగు అసోసియేషన్ (గీత) ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా దివంగత వైఎస్సార్ కు ఆహూతులు ఘనంగా నివాళులు అర్పించారు.
రెండు నిమిషాలు మౌనం పాటించి వైఎస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని సంతాపసభకు హాజరైన సభ్యులందరినీ 'గీత' కార్యదర్శి రాము చింతల కోరారు. తరువాత భగవద్గీతలోని శ్లోకాలను గీత బోర్డు సభ్యుడు మోహన్ దేవరాజు ఆలపించారు.
అనంతరం ఇండియానా సెక్రటరీ ఆఫ్ స్టేట్ టాడ్ రొకిట మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డిని 2005లో హైదరాబాద్ లో కలుసుకున్నప్పటి విశేషాలను భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. వైఎస్ నిజమైన నాయకుడని కొనియాడారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) పూర్వ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రారెడ్డి గవ్వ తన అనుభవాలను పంచుకుంటూ, ఆటాకు - డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆంధ్రరాష్ట్రమే కాకుండా, యావద్దేశం, ప్రపంచంలోని తెలుగు వారు ఒక గొప్ప మహానాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ - విజయవాడల మధ్య ఉన్న 9వ నెంబర్ జాతీయ రహదారిని 'రాజశేఖరరెడ్డి హైవే'గా పేరుపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ మృతి తీరని లోటు అని హిందూ టెంపుల్ కమిటీ సభ్యుడు డాక్టర్ మర్రి సత్యనారాయణ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇండియానా పోలిస్, గ్రేటర్ ఇండియానా పోలిస్ తెలుగు అసోసియేషన్ సంస్థలకు ప్రెసిడెంట్ గా పనిచేసిన రాజు చింతల వైఎస్ కు నివాళులు అర్పిస్తూ, ఆంధ్రరాష్ట్రం వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి మహా నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం అన్నారు.
ఇటీవలే ఆకస్మికంగా మరణించిన శ్రీనివాస్ యాగంటికి గీత సభ్యులంతా సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.
News Posted: 17 September, 2009
|