ప్రవాసాంధ్ర విద్యార్థి మృతి

టెక్సాస్ : బ్యూమాంట్ లోని లామర్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్. చదువుతున్న 23 ఏళ్ళ ధీరజ్ సుఖవాసి గత సెప్టెంబర్ 14 సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో హ్యూస్టన్ లో అనుమానాస్పదంగా మృతిచెందినట్లు తానా ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ప్రసాద్ తోటకూర తెలిపారు. ధీరజ్ మృతికి గల కారణాలు తెలియరాలేదని, ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన ధీరజ్ తండ్రి ధనుంజయరావు హెచ్ సిఎల్ ఉద్యోగి. ప్రోగ్రెసివ్ ఇంజనీరింగ్ కాలేజిలో గ్రాడ్యుయేషన్ చేసిన ధీరజ్ 2007లో లామర్ విశ్వవిద్యాలయంలో చేరి ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. ధీరజ్ కు తల్లి శైలజ, తండ్రి ధనుంజయరావు, సోదరి శైలజ, ఇంటర్ చదువుతున్న తమ్ముడు ఉన్నారని ప్రసాద్ తోటకూర తెలిపారు.
మృతదేహాన్ని హైదరాబాద్ పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ధీరజ్ కుటుంబ సభ్యులకు తానా స్క్వేర్ సభ్యులు సహాయం చేస్తున్నారని తానా కార్యదర్శి మోహన్ నన్నపనేని తెలిపారు. ఈ కష్టకాలంలో తగిన సహాయ సహకారాలు అందిస్తున్న పూర్ణ వీరపనేని, విజయ్ వేములపల్లి, మురళి వెన్నం, శ్రీనివాస్ సుఖవాసి, సుధీర్ కాటపల్లి, ఇతర వలంటీర్లకు తానా ప్రెసిడెంట్ జయరామ్ కోమటి కృతజ్ఞతలు తెలిపారు.
ధీరజ్ కుటుంబ సభ్యులతో ప్రసాద్ తోటకూర ఫోన్ లో మాట్లాడారు. తానా తరఫున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ధీరజ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ పంపించేందుకు యూనివర్శిటీ అధికారులతోను, రాయబార కార్యాలయం అధికారులతోను ప్రసాద్ సంప్రతించినట్లు తెలిపారు.
News Posted: 17 September, 2009
|