యువతలో కలాం స్ఫూర్తి

లాస్ ఎంజిల్స్ (కాలిఫోర్నియా) : భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు దార్శనికత, సృజనాత్మకత గల నాయకత్వం రావాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా ఉందని భారతరత్న, భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. 'ఆప్ బడో దేశ్ కో బడోవో' అంటూ ఆయన యూనివర్శిటీ ఆఫ్ సదర్న్ కానిఫోర్నియా (యుఎస్ సి)లోని అసోసియేషన్ ఫర్ ఇండియన్ స్టూడెండ్స్ (ఎఐఎస్) లీడ్ ఇండియా 2020 నిర్వహించిన సమావేశంలో కలాం ఉత్తేజకరమైన ఉపన్యాసం చేశారు. కలాం చెబుతున్న ప్రతి మాటకు సభాసదులైన విద్యార్థుల నుంచి స్టాండింగ్ ఓవేషన్ లభించింది. సెప్టెంబర్ 15న యుఎస్ సి సహాయంతో లీడ్ ఇండియా 2020 యుఎస్ఎ చాప్టర్ నిర్వహించిన అబ్దుల్ కలాం ఉపన్యాస కార్యక్రమానికి రవి కోనేరు కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు.
నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు హాజరైన కలాం ఉపన్యాస కార్యక్రమానికి 'రిలిజియన్ ఫర్ లైఫ్' డీన్ వరుణ్ సోని ఆహ్వానం పలికారు. లీడ్ ఇండియా 2020 దార్శనికత, వ్యూహం, లక్ష్యాలు, సాధించిన విజయాలు, విశేషాలపై ఆ సంస్థ యుఎస్ఎ చాప్టర్ కార్యదర్శి గోపీనాథ్ గోపాలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కలాం మాట్లాడుతూ, పట్టణాలు - గ్రామీణ ప్రాంతాల మధ్య భేదాన్ని బాగా తగ్గించినప్పుడు, నీరు, విద్యుచ్ఛక్తి సరఫరాను సమానంగా చేసినప్పుడు, విద్యను ఏ ఒక్కరూ వ్యతిరేకించనప్పుడు, పేదరికాన్ని నిర్మూలించినప్పుడు, పరిపాలనలో ప్రభుత్వం పారదర్శకత పాటించినప్పుడు, దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నప్పుడు, హింస, ఉగ్రవాదం పీడ లేవని ప్రజలు భావించినప్పుడు ప్రపంచానికే భారతదేశం తలమానికం కాగలదని కలాం ఉద్బోధించారు. అలాంటి స్థితిని సాధిస్తామని ప్రతి యువకుడూ ప్రతిజ్ఞ చేసి, కృషి చేయాలని కలాం పిలుపునిచ్చారు. విద్యలో మంచి ప్రతిభ కనబరచడంతో పాటే విద్యార్థులు సృజనాత్మకత గల నాయకులుగా ఎదిగేందుకు అవసరమైన లక్షణాలను పెంపొందించుకోవాలని కలాం హర్షధ్వానాల మధ్య ఉద్బోధించారు. 2011 వ సంవత్సరం, 11వ నెల 11వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లకు భారతదేశంలో నిరక్షరాస్యతను, అవినీతిని నిర్మూలించాలంటూ నిర్వహించే 'మానవహారం'లో కలిసి పాల్గొనాలని ప్రతి ఒక్కరికీ కలాం పిలుపునిచ్చారు. ఉపన్యాసం అనంతరం కలాం విద్యార్థులు అడిగి అనేక ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానాలు ఇచ్చారు. ఎన్నెన్నో మంచి విషయాలు తమకు విశదపరిచిన కలాంకు యూనివర్శిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా విద్యర్థుల తరఫున కైలాష్ గాజర కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం లీడ్ ఇండియా 2020 యుఎస్ఎ చాప్టర్ డాక్టర్ కలాంను శాలువతోను, యుఎస్ సి - ఎఐఎస్ బోర్డు మెమెంటోతో సత్కరించాయి.
News Posted: 22 September, 2009
|