ఆఫ్ఘన్ లో శ్రీనివాస్ గజల్

కాబూల్ : తెలుగు గజల్ కు గిన్నిస్ గౌరవం అందించిన గజల్ శ్రీనివాస్ తన గానామృతాన్ని ఆఫ్ఘన్ లో పంచిపెట్టేందుకు వస్తున్నారు. కాబూల్ నగరంలోని మేవాండ్ బ్యాంకులో ఈ నెల 25న నిర్వహించే ఈద్ ఉత్సవాల్లో గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, శాంతిగీతాలు ఆలపించనున్నారని మేవాంద్ బ్యాంకు సిఇఓ పివివి రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీజీ బోధించిన అహింస మార్గాన్ని శ్రీనివాస్ తన గజల్ స్వరాలుగా మార్చి ఆఫ్ఘనిస్తాన్ - భారతదేశాల మధ్య సుహృద్భావం నెలకొల్పేందుకు ఈ పర్యటనలో యత్నిస్తారని రామరాజు తెలిపారు. ఈ నెల 23నుంచి అక్టోబర్ 2 పూజ్య బాపూజీ గాంధీ జన్మదినోత్సవం రోజు వరకూ మొత్తం పది రోజుల పాటు గజల్ శ్రీనివాస్ ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో భాగంగా శ్రీనివాస్ పలువురు తెలుగు సంఘాల సమావేశాల్లో ప్రసంగిస్తారు. పలువురు మిత్రులు, సంగీతకారులు, సాహితీవేత్తలు, శాంతి ఉద్యమకారులతో శ్రీనివాస్ కలుసుకుంటారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ పాష్తో, దరి, బలూచి, అరబిక్ భాషల్లో గజల్ శ్రీనివాస్ గజళ్ళు గానం చేస్తారని మేవాద్ బ్యాంకు చైర్మన్ డాక్టర్ ఫ్రైదూన్ నూర్జద్ వివరించారు. అక్టోబర్ 2న భారత రాయబార కార్యాలయంలో నిర్వహించే గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే అంతర్జాతీయ అహింసా దినోత్సవాల్లో శ్రీనివాస్ రూపొందించిన 'దోస్తీ - సోల్' అనే ఆడియో ఆల్బమ్ ను విడుదల చేస్తారు. ఈ ఆల్బమ్ ను శ్రీనివాస్ భారత - ఆఫ్ఘనిస్తాన్ స్నేహం, శాంతికి అంకితం చేశారు.
News Posted: 22 September, 2009
|