ఘనంగా టిడిఎఫ్ బతుకమ్మ వాషింగ్టన్ : తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే బతుకమ్మ పండుగ వాషింగ్టన్ లో వైభంగా జరిగింది. ఈ నెల 19 శనివారంనాడు లేక్ ఫైర్ ఫాక్స్ పార్క్ లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వందలాది మంది ప్రవాసాంధ్రులు అత్యంత భక్తి శ్రద్ధలు, ఉత్సాహంతో పాల్గొన్నారు. లెక్కకు మిక్కిలి భక్తులు తరలిరావడంతో లేక్ ఫైర్ ఫాక్స్ పార్క్ కిక్కిరిసిపోయింది. రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అలంకరించే సాంప్రదాయానికి అనుగుణంగా 350 మందికి పైగా వివిధ రంగుల్లో సంప్రదాయ దుస్తులను ధరించి ఉత్సవానికి హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టిడిఎఫ్ బతుకమ్మ సంబరాల్లో అనుకోని అతిధి టివి 9 సిఇఓ రవిప్రకాశ్ పాల్గొని అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు.
ఈ బతుకమ్మ ఉత్సవాలను స్థానిక తెలుగు సంఘాలు, టివి 9, తెలంగాణ జాగృతి సంస్థల సహాయ సహకారాలతో వాషింగ్టన్ లోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం వలంటీర్లు నిర్వహించారు. ఈ సంవత్సరపు బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో తమ విలువైన సమయాన్ని వెచ్చించి కార్యదీక్షతో అహరహం శ్రమించిన వలంటీర్లకు టిడిఎఫ్ కృతజ్ఞతలు తెలిపింది. కల్యాణ్ ముద్దసాని, ప్రవీణ్ శ్యామల, రాజేష్ బాదం, విష్ణుప్రసాద్, ప్రదీప్ నూగూరు, అమర్ జన్నపురెడ్డి, శ్రీనివాస్ విప్ప, బాలకృష్ణ పట్లోరి, అనిల్ కాసినేని, ప్రశాంత్ పురం, రాజేష్ మాదిరెడ్డి వలంటీర్లుగా బతుకమ్మ పండుగ ఏర్పాట్లను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు.
స్వర్ణ వీర్ల, మంజు తుమ్మల, సునీత గడప, శ్వేత ముద్దసాని రూపొందించిన బతుకమ్మలు ఉత్తమమైన బతుకమ్మ బహుమతులను గెలుచుకున్నాయి.
News Posted: 22 September, 2009
|