ఆకట్టుకున్న తెలుగు వెన్నెల డల్లాస్ : తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ తెలుగు సాహిత్య వేదిక నిర్వహించిన 26 వ 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం స్థానిక కోకిల ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 30 మంది సాహిత్య ప్రియులు హాజరయ్యారు. సమావేశానికి విప్లవరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
మొదట ఆచంట సుబ్రమణ్యం ఆది శంకరాచార్యుల వారి భవానీ అష్టకం చదివి వినిపించారు. తరువాత శాంత పులిగండ్ల దేవి నవరాత్రుల సందర్భంగా చక్కని గీతాలాపన చేశారు. తదుపరి డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి హాస్యభరితమైన స్వీయ పద్యాలు వినిపించారు. తరువాత మురళీధర్ టెక్కలకోట స్వీయ కవిత 'ఓ చెట్టు కథ' చదివి వినిపించారు. పిమ్మట అన్నవరపు రంగనాయకులు మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం గురించి వివరించారు. తరువాత ఆచార్య పుదూర్ జగదీశ్వరన్ మహాభారత పద్యాలు ఆలపించారు. తరువాత రమణ జువ్వాది పద్యాలను రాగయుక్తంగా వినిపించారు.
ఈ సాహితీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంత్ మల్లవరపు చదివిన ఎండ్లూరి సుధాకర్ 'విసనకర్ర' కవిత ఆహూతులను ఆకట్టుకుంది. ముఖ్యఅతిథి విప్లవరెడ్డిని ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేశారు. విప్లవరెడ్డి 'కథ - భాష - సంస్కృతి' అంశంపై ప్రసంగించారు. ముఖ్యఅతిథిని శాంత పులిగండ్ల పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, రమణ జువ్వాది శాలువతో, సాహితీ వేదిక కార్యవర్గం జ్ఞాపికతో సన్మానించారు. ఎం.వి.ఎల్. ప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
News Posted: 25 September, 2009
|