డిటిసి బతుకమ్మ సంబరం

డెట్రాయిట్ : సంప్రదాయ బద్ధమైన బతుకమ్మ పండుగను డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటి (డిటిసి) ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈనెల 25న జరిగిన ఈ సంబరాల్లో డెట్రాయిట్ మెట్రో ప్రాంతంతో పాటు లాన్సింగ్, యాన్ ఆర్బర్, జాక్సన్, కెనడాలోని ప్రవాసాంధ్రులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 12 వందల మందికి పైగా ఆనందోత్సాహాలతో హాజరయ్యారు.
మహిళలు సాంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకురావడంతో డెట్రాయిట్ బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. కేరింతలు, ఆట పాటలతో ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొన్న చిన్నారులు ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రసిద్ధ తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన జానపద గేయకారుడు, కళాకారుడు గోరటి వెంకన్న బతుకమ్మకు సంబంధించిన పాటలతో పాటు పలు ఇతర జానపద గేయాలతో పాటు సాంప్రదాయ తెలంగాణ పాటలు పాడారు. ఆహూతులందరినీ ఎంతగానే తన పాటలతో అలరించిన వెంకన్నను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ గ్రూప్ సంస్థ సిఇఓ, మిర్చి ఇండియన్ కుషన్ యజమాని భరత్ రెడ్డి మందాడి సత్కరించారు.
తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ సంస్థ నిర్వాహకులను ప్రత్యక్ష వీడియో కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. పలువురు దాతలు ఉదారంగా అందించిన విరాళాల కారణంగా డెట్రాయిట్ బతుకమ్మ సంబరాలు వైభవంగా పూర్తయ్యాయి. పండుగలో తెలంగాణ రుచులను కమ్మగా వండి ఉదారంగా సరఫరా చేసిన మిర్చి ఇండియన్ కుషన్ సంస్థను నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పండుగను వరంగల్ కు చెందిన బ్లైండ్ కేర్ సంస్థ కూడా స్పాన్సర్ గా వ్యవహరించింది.
బతుకమ్మ పండుగను భరత్ మందాడి, శ్రీధర్ బండారు, అశోక్ పెరుమాండ్ల, వెంకట్ మంథెన, దామోదర్ గంకిడి, సునీల్ మర్రి, సిద్ధార్థ్ అన్నెబోయిన, రఘు, ప్రవీణ్, ప్రీతి, శిరీష, రామ్, మురళి చక్కని ప్రణాళికతో, సమన్వయంతో నిర్వహించారు.
News Posted: 26 September, 2009
|