అమెరికాలో 'పురందేశ్వరిడే'

టెక్సాస్ : భారత కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. టెక్సాస్ రాష్ట్రంలోని కోలీవిల్ నగరాన్ని ఆమె ఈ నెల 27 ఆదివారం సందర్శించినందుకు గౌరవ సూచకంగా 2009 సెప్టెంబర్ 27ను నగర కౌన్సిల్ 'పురందేశ్వరి డే' గా ప్రకటించింది. పురందేశ్వరి డేని, ఉత్తర అమెరికన్ తెలుగు సొసైటీ సంస్థ సేవలను ప్రశంసిస్తూ అధికారికంగా జారీ చేసిన ప్రభుత్వ పత్రాన్ని కొలీవిల్ నగర మేయర్ డేవిడ్ కెల్లి పురందేశ్వరికి అందజేశారు. ఈ సందర్భంగా భారత దివంగత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, పురందేశ్వరి తండ్రి ఎన్టీ రామారావు, ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిలకు నివాళులు అర్పించారు.
జాతిపిత, మహాత్మాగాంధీ 140 జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కొలీవిల్ నగరంలో నాట్స్ సంస్థ నిర్వహించిన 'ఫుడ్ డ్రైవ్' కార్యక్రమానికి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా, కొలీవిల్ నగర మేయర్ డేవిడ్ కెల్లి, స్యాల్వేషన్ ఆర్మీ మేజర్ గ్రీన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కెల్లి మాట్లాడుతూ, అమెరికాలో భారతీయుల, స్వచ్ఛంద సేవా సంస్థల కృషిని కొనియాడారు. స్యాల్వేషన్ ఆర్మీ మేజర్ గ్రీన్ మాట్లాడుతూ, నాట్స్ నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ కు ఇంత మంచి స్పందన రావడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ, తన తండ్రి ఎన్టీ రామారావుని, పితృ సమానులైన పి.వి. నరసింహారావును, సోదర సమానులైన రాజశేఖరరెడ్డిని స్మరించి, వారి ఆశయ సాధన కోసం పాటుపడుతున్న తన బాధ్యతను గుర్తుచేశారన్నారు. వారి ఆశయ సాధన కోసం ఈ సభ సాక్షిగా పునరంకితం అవుతానన్నారు. ఇది తనకు పునరంకిత సభ అని అభివర్ణించారు. నాట్స్ నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను పురందేశ్వరి ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని నాట్స్ సంస్థకు ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సుమారు 3 వందల మంది తెలుగువారు హాజరయ్యారు.
News Posted: 30 September, 2009
|