'తెలుగు భాషకు తోడ్పడండి'

డల్లాస్ : తెలుగు భాషాభివృద్ధికి ప్రవాసాంధ్రులు కృషిచేయాలని భారత కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. డల్లాస్‌లోని డాక్టర్ పెప్పర్ కన్వెన్షన్ సెంటర్ లో తానా ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్శిటీలో తెలుగు భాష విస్తరణ కోసం చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమాన్ని పురందేశ్వరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి ప్రసంగిస్తూ, అమెరికాలో మరికొన్ని విశ్వవిద్యాలయాల్లోనూ తెలుగు కోర్సులు ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రిగా అవసరమైన తోడ్పాటు అందిస్తానని తెలిపారు. అగ్రరాజ్యంలో తెలుగు భాషాభివృధ్ధికి తానా చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. తెలుగువారు ఎక్కువగా నివసిస్తున్న బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు కోర్సులు ప్రవేశపెట్టేందుకు అక్కడి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని కోరారు. విరాళాలు అందజేసిన దాతలను పురందేశ్వరి సత్కరించారు. సభికుల హర్షధ్వానాల మధ్య 2013లో డల్లాస్ లోని డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే 19వ తానా మహాసభల వేదికను పురందేశ్వరి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు కోమటి జయరాం, కార్యనిర్వాహక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, మాజీ అధ్యక్షులు నవనీత కృష్ణ, రాఘవేంద్ర ప్రసాద్, కోశాధికారి రాం యలమంచిలి, రీజినల్ ఉపాధ్యక్షుడు మురళి వెన్నం, టాంటెక్స్ అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పసంద్ రెస్టారెంట్ యాజమాన్యం రుచికరమైన భోజనాన్ని అందించింది.
News Posted: 30 September, 2009
|