ఆంధ్రా పల్లెల్లో ఆటా వేడుక

చికాగో : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) రెండేళ్ళకోసారి భారతదేశంలో నిర్వహిస్తున్న ఆటా వేడుకల్లో భాగంగా ఈసారి ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మైలవరం, మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణాలతో పాటు మరికొన్ని గ్రామాలను కూడా ఆటా బోర్డు ఎంపిక చేసింది. సెప్టెంబర్ 26న ఇక్కడ సమావేశమైన ఆటా బోర్డు ఈ మేరకు నిర్ణయించింది. ఈ సమావేశానికి ఆటా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. వేడుకల్లో భాగంగా ఆయా పట్టణాల్లో స్థానికుల సహాయ సహకారాలతో వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆటా నిర్వహిస్తుంది.
దేశవిదేశాల్లో ఉంటున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య చక్కని సంబంధాలు ఏర్పాటు చేయగల సామర్ధ్యం ఉన్న ఉత్సాహవంతులైన స్థానికులను ఈ వేడుకల సందర్భంగా ఆటా ఎంపిక చేస్తుంది. వచ్చే డిసెంబర్ ఆఖరి వారంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఆటా వేడుకలకు ఆటా సంస్థ నాయకులు పలువురు హాజరవుతున్నారు. ఆటా వేడుకల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులు, కులపెద్దలు, రచయితలు, మేధావులు, సినిమా నటీనటులు తదితరులను ఆహ్వానించాలని ఆటా బోర్డు నిర్ణయించింది.

ముందుగా సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్తుగా అసువులు బాసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించడం ద్వారా ఆటా బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తొలిసారిగా బోర్డ్ ఆఫ్ ట్రస్టీలందరూ హాజరు కావడం విశేషం. అమెరికాలో ఉంటున్న తెలుగువారి ఐక్యతకు ఆటా సంస్థ ప్రతీక నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో త్వరలో హ్యూస్టన్ నగరంలో జరగనున్న ఆటా సదస్సు నిర్వహణకు సంబంధించిన అంశాలతో పాటు పలు ఇతర ముఖ్య విషయాలను బోర్డు చర్చించింది.
News Posted: 1 October, 2009
|