అభివృద్ధిలో ఆంధ్ర ఆదర్శం

న్యూయార్క్ : గ్రామీణాభివృద్ధిలో భారతదేశంలోని రాష్ట్రాలన్నీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ (ఐనాక్) ప్రెసిడెంట్ డాక్టర్ మల్హోత్రా పిలుపునిచ్చారు. నిరుపేదలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించి, అమలు చేసిన పథకాలు ఆ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాయని ఆయన ప్రశంసించారు. ఐనాక్ ఆంధ్ర విభాగం ఎపి ఐనాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఎపి కాన్స్ టిట్యుయెన్సీ వెల్ఫేర్ ప్రోగ్రామ్'ను 'డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూరల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు'గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా న్యూయార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 'డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూరల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు' ఆలోచనను, ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు ఉత్సాహవంతులైన ప్రవాసాంధ్రులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో ఎపి ఐనాక్ ప్రెసిడెంట్ మహేష్ సలాది చక్కని కృషి చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని 278 మండలాల్లో ఉన్న తమ తమ సొంత గ్రామాలను దత్తత తీసుకుని నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రులు కూడా పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చి ప్రోత్సహించడం ముదావహం అని మహేష్ సలాది తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం స్టేజి మీద ఉన్న ప్రవాసాంధ్రులే కాకుండా మరెందరో ఉత్సాహం ప్రదర్శించారని చెప్పారు. ఈ కార్యక్రమానికి మహేష్ సలాది వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధం, ఆయన పట్ల ఉన్న అపరిమిత అభిమానం, ప్రేమే ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడానికి కారణం అవుతున్నాయన్నారు.
మితభాషి, సరళంగా మాట్లాడుతూ, కార్యదీక్షాపరుడైన డాక్టర్ మల్లారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా దుర్మరణం చెందిన సంఘటన గురించి, ఆయనతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధం గురించి, ఆంధ్రప్రదేశ్ లో తాను ప్రారంభించిన సాంఘిక, వ్యాపార కార్యకలాపాలకు వైఎస్ అందించిన సహాయం గురించి వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పలు కొత్త కొత్త పథకాల గురించి అర్జున్ ద్యాప వివరంగా తెలిపారు. వైఎస్ రూపొందించిన నూతన పథకాలను, ఆయన ఆలోచనా విధానాలను దేశ వ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
దివంగత వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని హిందూ మత గురువు, క్రిస్టియన్ పాదర్ ఈ సమావేశంలో ప్రార్థనలు చేశారు. మహా నాయకుడిని, మంచి కుటుంబ యజమానిని కోల్పోయిన రాష్ట్ర ప్రజలు, వైఎస్ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా సానుభూతి ప్రకటించారు. ఇదే వేదిక మీద ప్రసంగించిన ప్రతి ఒక్కరూ వైఎస్ తో తనకు గల అనుబంధం, అనుభవాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్రామీణులను, రైతులను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వైఎస్ గాంధీ సిద్ధాంతాలను అనుసరించారని సుంకర అప్పారావు పేర్కొన్నారు. ఇంకా ఇదే వేదిక మీద రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ మండవ, డాక్టర్ పోలవరపు రావు, డాక్టర్ గడ్డం రెడ్డి, మహేందర్ ముసుకు తదితరులు వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతాశయాలు, జీవన విధానం, ప్రజాసేవలో వైఎస్ వ్యవహార సరళి, ఆయన గుణగణాలు తదితర విషయాల గురించి వివరించారు.
News Posted: 1 October, 2009
|