ఎన్నారైలకు రోశయ్య విజ్ఞప్తి

న్యూజెర్సీ : మహా నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కోల్పోయిన తరువాత ఆంధ్రరాష్ట్రానికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న ప్రస్తుత తరుణంగా ప్రవాసాంధ్రులు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విజ్ఞప్తి చేశారు. కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదుల వరదలు ముంచెత్తి అతలాకుతలమైన కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లోని బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రవాసాంధ్రులకు రోశయ్య కృతజ్ఞతలు తెలిపారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన సందర్భంగా అక్టోబర్ 3వ తేదీన న్యూజెర్సీలోని హొటల్ రాడిసన్ లో జరిగిన ప్రైవేట్ టెలికాన్ఫరెన్స్, టెలిఫోన్ లో రోశయ్య మాట్లాడారు. సుమారు ఆరు వందల మందికి పైగా అతిథులు హాజరైన ఈ సమావేశాన్ని ప్రవాసాంధ్ర వాసవైట్స్ సంస్థ నిర్వహించింది. సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో 2010 - 11వ సంవత్సరానికి నూతన కార్యనిర్వాహక కమిటీని ఎన్నుకున్నారు.
మాతృభూమికి ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవలు ప్రశాంసార్హంగా ఉన్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రోశయ్య అభినందించారు. వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు కోల్పోయి, ఇళ్ళు ధ్వంసమైపోయి నిరాశ్రయులుగా మారిన వేలాది మంది గ్రామీణ ప్రజలకు చేయూతనిచ్చేందుకు ప్రవాసాంధ్రులు మరింత ఉదారంగా ముందుకు రావాలని రోశయ్య విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల సహాయార్థం రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు మరింత వేగంగా, అధికంగా నిర్వహించేందుకు, వరద బాధితుల సహాయం కోసం ప్రవాసాంధ్రులు ఉదారంగా విరాళాలు అందించాలని కోరారు.
ఈ సమావేశంలో టెలికాన్ఫరెన్స్, ఫోన్ కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని దాసరి పవన్ కుమార్, ఆనంద్ గార్లపాటి, బాల వోలేటి, హరి రైని, విజయ్ చవ్వ కల్పించారు. భారతదేశం నుంచి వచ్చిన ప్రతినిధులతో పాటు అమెరికా వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖ వాసవైట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News Posted: 7 October, 2009
|