ఫ్రీమాంట్ లో బతుకమ్మ

కాలిఫోర్నియా : ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలుగు కుటుంబాలు, మిత్రులు ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఫ్రీమాంట్ నగరంలోని వార్మ్ స్ప్రింగ్స్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో సాంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పండుగలో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులు, మహిళలు, చిన్నారులు బతుకమ్మ సంబరాల్లో పిక్నిక్ మాదిరిగా సంతోషంగా గడిపారు. ఆంధ్ర రాష్ట్రంలోని నలు మూలల నుంచీ వలస వచ్చినవారు, విజిటర్లు ఇక్కడ నివాసం ఉంటున్న తెలుగువారు పెద్ద సంఖ్యలో బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు.
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ వారంతా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన గత స్మృతులను నెమరు వేసుకున్నారు. తెలంగాణ సాంప్రదాయ ఉత్సవాల గురించి తమ భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో ఉపకరిస్తాయని హర్షం వ్యక్తం చేశారు.
బతుకమ్మ సంబరాలు నిర్వహించాలనుకున్న తరువాత కేవలం నాలుగు రోజుల అతి తక్కువ సమయంలో బతుకమ్మ సంబరాలను ఎంతో చక్కగా నిర్వహించేందుకు కృషి చేసిన వలంటీర్లు వారి కుటుంబసభ్యులు అలివేణి - రంగ చిగుళ్ళపల్లి, ప్రతిమ - ఆల్వాల్ రెడ్డి పుట్టా, రమ - రాజారెడ్డి కప్పెర, స్వప్న - సోమశేఖర్ కంచెర్ల, విజేందర్ జిల్లెళ్ళ కుటుంబాలకు అతిథులంతా అభినందనలు తెలిపారు.
News Posted: 10 October, 2009
|