ఘనంగా గాంధీ జయంతి

చికాగో : భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంత్యుత్సవాలు చికాగోలో మొట్టమొదటిసారిగా ఘనంగా జరిగాయి. చికాగో తెలుగు అసోసియేషన్ ఈ ఉత్సవాలను నిర్వహించింది. మార్టిన్ లూథర్ కింగ్ స్కూల్ లో జరిగిన మహాత్మా గాంధీ జయంత్యుత్సవాల్లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ అశోక్ కుమార్, ఉషా అత్రి, చికాగో నగర హ్యూమన్ సర్వీసెస్, కమ్యూనిటీ లైజన్ డైరెక్టర్ క్రిస్ ఝాల గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ నిర్వహించిన సంఘసేవ సమాజంపై బలీయమైన ముద్ర వేశాయని ఈ సందర్భంగా అశోక్ అత్రి అన్నారు. అలాంటి సమాజసేవా దృక్పథంతో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహంచేందుకు చికాగో తెలుగు అసోసియేషన్ ముందుకు రావడం మహాత్మాగాంధీకి చక్కని నివాళి అర్పించినట్లు అని ఆయన ప్రశంసించారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను తుచ తప్పకుండా అనుసరించిన మార్టిన్ లూథర్ కింగ్ పేరు మీద ఉన్న పాఠశాలలో బాపూజీ జయంత్యుత్సం నిర్వహించడం ఆయనకు కూడా చక్కగా నివాళులు అర్పించినట్లైందన్నారు. సిటీ ఆఫ్ చికాగో మేయర్ ప్రతినిధి క్రిస్ ఝాలా మాట్లాడుతూ, సిటిఎ నిర్వహిస్తున్న సమాజ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు.

పెద్ద సంఖ్యలో సిటిఎ వలంటీర్లు, ప్రవాసాంధ్ర నాయకులు, అతిథులు అందరూ గాంధీ విగ్రహం వరకూ నిర్వహించిన మౌన యాత్రలో పాల్గొన్నారు. మౌన యాత్రలో పలువురు అమెరికా దేశీయులు కూడా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం విశేషం.
గాంధీ జయంతిని పురస్కరించుకొని సిటిఎ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. పలువురు సిటిఎ వలంటీర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలపై ప్రత్యేకంగా నిర్వహించిన పెయింటింగ్, వ్యాసరచన పోటీలో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు ఇండియన్ కాన్సులేట్ జనరల్ అశోక్ కుమార్ అత్రి బహుమతులను ప్రదానం చేశారు.
News Posted: 10 October, 2009
|