గోపీచంద్ పాత్రలు సజీవాలు

చికాగో : కథల్లో పాత్రల ఎంపిక విషయంలో తన తండ్రి, ప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీచంద్ ఎంతో శ్రద్ధ తీసుకునేవారని సినీనటుడు సాయిచంద్ తెలిపారు. ఆయన కథల్లో అత్యధిక పాత్రలుగా నిజజీవితంలో పరిచయం ఉన్న వ్యక్తులనే తీసుకునేవారని సాయిచంద్ గుర్తు చేసుకున్నారు. నాస్తికవాది, జస్టిస్ పార్టీ నాయకుడైన తన తాతగారు త్రిపురనేని రామస్వామి ప్రభావం తండ్రి గోపీచంద్ పై ఎంతగా ఉండేదీ ఆయన నెమరు వేసుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో సంస్థ అక్టోబర్ 3 శనివారం నాడు లేమాంట్ లోని గ్రేటర్ చికాగో హిందూ దేవాలయం రామా ఆడిటోరియంలో ప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీచంద్ సాహిత్యంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో సాయిచంద్ మాట్లాడారు. తన తొలి చిత్రం 'మా భూమి' సినిమా మొదలు తన నటజీవితంలో ఎలాంటి గౌరవం, ఆదరణ లభించిందీ సాయిచంద్ వివరించారు.

ఈ సాహితీ సదస్సుకు హాజరైన అతిథులు, ఆహూతులను చికాగో సాహితీ మిత్రులు ప్రెసిడెంట్ డాక్టర్ రవిరెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యఅతిథిని ప్రేక్షకులకు జయదేవ్ మెట్టుపల్లి పరిచయం చేశారు. హిందూ దేవాలయానికి చెందిన భీమారెడ్డి సాయిచంద్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సాహితీ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సాయిచంద్ కు, విజయవంతం చేసిన ప్రేక్షకులకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో తరఫున అమర్ నెట్టెం ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు, భారతదేశం నుంచి అమెరికా పర్యటనకు వచ్చిన డాక్టర్ జెఎల్ రెడ్డి ఈ చర్చా గోష్ఠిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గోపీచంద్ ప్రసిద్ధ రచన 'అసమర్థుని జీవయాత్ర' నవల గురించి ప్రసంగించారు.
News Posted: 10 October, 2009
|