'దిల్' రాజుకు సన్మానం

న్యూజెర్సీ : పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన 'దిల్' రాజుకు న్యూజెర్సీలో అభినందన సభ జరిగింది. ఎడిసన్ లోని 'కోరియాండర్' ఇండియన్ రెస్టారెంట్ లో జరిగిన దిల్ రాజు సన్మాన సభను మహేష్ సలాది సమర్థంగా నిర్వహించారు. 'మరో చరిత్ర' సినిమా షూటింగ్ కోసం న్యూజెర్సీ వచ్చిన దిల్ రాజుకు, ఆయనతో పాటే వచ్చిన చిత్రం హీరో వరుణ్ సందేష్ ను కూడా ఈ సందర్భంగా సన్మానించారు.
అనితా కృష్ణ ప్రార్థనాగీతంతో ప్రారంభమైన ఈ సభలో కోరియాండర్ కుషన్ అధినేత, గేదెల దాము శాలువ, పుష్పమాలతో అతిథులను సన్మానించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత పాడిన శ్రావ్యమైన పాటలు అందరినీ అలరించాయి. సినీ హాస్య నటుడు వేణు సినిమా పేర్లతోను, మరో హాస్య నటుడు వెంకీ సినీ సంగీత దర్శకుల అనుకరిస్తూ నవ్వుల పువ్వులు పూయించారు. స్థానికంగా ఉన్న ప్రముఖ సినీ కవి, దర్శకుడు, సెన్సార్ సభ్యుడు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ కవితాత్మకంగా దిల్ రాజు గొప్పదనాన్ని, సినీ గ్లామర్ కు సందేశ ఆత్మక గ్లామర్ ను జోడించి తీసిన బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకంలను ఉదాహరణగా ప్రస్తావించారు.

తనకు జరిగిన సన్మానానికి దిల్ రాజు సమాధానం ఇస్తూ, ఎన్నారైలు సినిమాలు తీయదలిస్తే మనస్సు పెట్టి మంచి చిత్రాలు నిర్మించాలని సూచించారు. లేకపోతే తాము పుట్టిన పల్లెలను మరచిపోకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, హ్యాపీ డేస్ చిత్రం ద్వారా తనను వెండి తెరకు పరిచయం చేసింది శేఖర్ కమ్ముల అయితే, కొత్త బంగారు లోకం ద్వారా దిల్ రాజు తనకు సుస్థిర స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని ఊహించని విధంగా అతలాకుతలం చేసిన వరద బాధితుల సహాయార్ధం విరివిగా విరాళాలిచ్చి ఆదుకోవాలని యూటా కార్యదర్శి ప్రదీప్ పిలుపునిచ్చారు. వరదల్లో మరణించిన వారి ఆత్మకు శాంతు కలగాలని నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు రవి పుసుకూరు దంపతులు, మహేందర్ ముసుకు, డాక్టర్ శాంతి, శ్రీనివాస్ గనగోని, సతీష్ దాసరి, భాస్కర్ భూపతి, అమర్ రెడ్డి, వాసు విశ్వనాథ్, రాము గేదెల, స్వర్ణ, మణి గేదెల, మంజు భార్గవి, రమేష్, రవి ధన్నపునేని, రవి పెద్ది, మోహన్ హాజరయ్యారు. కోరియాండర్ కుషన్ యజమాని అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 10 October, 2009
|