ప్రవాస చిరంజీవి ఆర్గ్ పిలుపు వాషింగ్టన్ : ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో సర్వస్వం కోల్పోయిన తెలుగు సోదరుల సహాయానికి ఎన్నారైలు ఉదారంగా ముందుకు రావాలని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. భారీ వర్షాలు, భీకర వరదలు రాష్ట్రంలోని ఏడు జిల్లాలను వారం రోజుల పాటు ముంచెత్తి గ్రామాలు, పట్టణాలను కన్నీటి సంద్రాలుగా మార్చేశాయని, వేలాది మంది నిరాశ్రయులై అలమటిస్తున్నారని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వరద బీభత్సానికి 206 మందికి పైగా మరణించారని, 3 లక్షల మందికి పైగా తమ తమ ఇళ్ళను వదిలి సురక్షిత ప్రాంతాలకు కట్టుబట్టలతో వెళ్ళిపోవాల్సి వచ్చిందని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ తెలిపింది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రెండు లక్షలకు పైగా ఇళ్ళు వరద ముంపులో ధ్వంసం అయ్యాయని, లేదా కూలిపోయాయని వివరించింది.
వరదల్లో చిక్కుకుపోయి ఆహారం మంచినీరు లేకుండా అల్లాడుతున్నప్పటికీ ప్రాణాలు దక్కించుకున్నవారికి ముందుగా ఆహారం, మంచినీరు, వైద్య సదుపాయం అందించాల్సిన ఆవశ్యకతను ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ముందుగా గుర్తించింది. ఈ క్రమంలో ఎన్ని ఎక్కువ కుటుంబాలకు వీలైతే అంత అధిక మొత్తంలో ప్రత్యక్షంగా సహాయం చేయాలని ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ఇంకా వరద ముంపులో ఉన్న గుంటూరు జిల్లా రేపల్లెలో తమ వలంటీర్లు ఇప్పటికే బాధితులకు ఆహారాన్ని అందించే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ నరసయ్య వడ్రాణం పేర్కొన్నారు. అయితే అక్కడ మరింత సమర్ధంగా సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రవాసాంధ్రుల చేయూత కూడా ఎంతో అవసరం అన్నారు. తమ తమ సహాయాన్ని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ కు పంపించాలని నరసయ్య వడ్రాణం విజ్ఞప్తి చేశారు. ఇలా వసూలైన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ లో వరద సహాయక కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తామన్నారు. ఒక్క డాలర్ నుంచి ఎంత మొత్తంలో అయనా సరే సహాయం కోసం అందజేయాలని కోరారు. ఆన్ లైన్ లో సహాయాన్ని అందజేయదలిచినవారు www.pravasachiranjeevi.org ను క్లిక్ చేసి వివరాలు పొందవచ్చన్నారు.
News Posted: 10 October, 2009
|