టిఎఫ్ఎఎస్ దీవాళి సంబరం న్యూజెర్సీ : ఈ ఏడాది దీపావళి, దసరా సంబరాలను ఈ నెల 24 శనివారం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలుగు కళా సమితి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూజెర్సీలోని ఈస్ట్ బర్న్స్ విక్ లో ఉన్న హామర్ జోల్డ్ మిడిల్ స్కూల్ లో జరిగే ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సంస్థ ఆహ్వానించింది.
దీపావళి, దసరా సంబరాల్లో భాగంగా పలు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజన, మిమిక్రీ కళాకారుడు, సినిమా నటుడు శివారెడ్డి ఈ సంవత్సరపు తెలుగు కళా సమితి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా 'మొగుడ్స్ పెళ్ళామ్స్' పోటీలను నిర్వహిస్తున్నారు. జి.వి. ప్రభాకర్ నేతృత్వంలో భారతదేశం నుంచి ప్రసిద్ధ గాయక బృందం శృతి, శ్రీనిధి, రఘురామ్ తమ గానామృతంతో ఆహూతులను అలరిస్తారని సంస్థ పేర్కొంది.
తెలుగు కళా సమితి దీపావళి, దసరా ఉత్సవాల్లో పాల్గొన దలచిన సభ్యులు 12 డాలర్లు (విందు భోజనంతో సహా) చెల్లించి తమ సీటు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని టిఎఫ్ఎఎస్ వెల్లడించింది. అన్ లైన్ లో టిక్కెట్ ను http://www.tfasnj.orgలో రిజర్వు చేసుకోవచ్చు. అలాగే టిఎఫ్ఎఎల్ అధ్యక్షుడు దాము గేదెలను సంప్రతించి 100 డాలర్లు ప్లెడ్జ్ చేసి ప్రయారిటీ సీటును దక్కించుకోవచ్చు. ప్లెడ్జెస్ \ స్పాన్సర్స్\ వలంటీర్లుగా పనిచేసేందుకు ఉత్సాహం చూపేవారు president@tfas.net Ph: 732-577-7112 సంప్రతించవచ్చు. సంబరాల్లో పాల్గొనే సంస్థ సభ్యులకు 12 డాలర్లు, సభ్యులు కానివారికి 20 డాలర్లు, 5 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు, పోటీల్లో పాల్గొనే 18 ఏళ్ళ లోపు వారికి 7 డాలర్లు ప్రవేశ రుసుముగా నిర్ణయించారు.
తెలుగు కళా సమితి దీపావళి, దసరా సంబరాలను ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు అంకితం చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా వసూలయ్యే అదనపు మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం అందజేయాలని టిఎఫ్ఎఎస్ నిర్ణయించింది.
దీపావళి, దసరా సంబరాల కార్యక్రమం వివరాలు :
అతిథుల రిజిస్ట్రేషన్ : మధ్యాహ్నం 3-4 గంటల మధ్య
సాంస్కృతిక కార్యక్రమాలు : సాయంత్రం 4 - 10 గంటల మధ్య
విందు భోజనం : సాయంత్రం 6 - 7 గంటల మధ్య ఉంటాయి.
News Posted: 16 October, 2009
|