సిటిఎ సాప్ శిక్షణ సక్సెస్

చికాగో : ప్రపంచాన్ని ఆర్థిక మాంధ్య కుదుపివేస్తున్న ప్రస్తుత గడ్డుకాలంలో ప్రవాస భారతీయలకు స్వచ్ఛంద సంస్థలు ఎలా చేయూతనివ్వవచ్చో చికాగో తెలుగు అసోసియేషన్ చక్కగా నిరూపిస్తోంది. ప్రవాసాంధ్రులకు ఉద్యోగం సంపాదించేందుకు, ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిలబెట్టుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో సిటిఎ పలు ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో చికాగో తెలుగు అసోసియేషన్ (సిటిఎ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ కోసం నిర్వహించిన ఒకరోజు ఉచిత ఎస్ ఎపి బిజినెస్ ఇంటెలిజెన్స్ శిక్షణ విజయవంతంగా జరిగింది. సుమారు 50 మంది ఉద్యోగార్థులు ఈ ఉచిత శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. సిటిఎ నిర్వహిస్తున్న ఈ శిక్షణకు తొలిసారిగా ప్రవాసాంధ్రులకే కాకుండా ఇతర భారతీయలకు కూడా అవకాశం కల్పించారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికా ఉంటున్న అనేక మంది కూడా సిటిఎ శిబిరంలో పాల్గొనడం విశేషం.
చికాగోలోని ష్కాంబర్గ్ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన ఉచిత ఎస్ ఎపి బిజినెస్ ఇంటెలిజెన్స్ శిక్షణ శిబిరానికి 60 మంది ఎన్నారైలు హాజరయ్యారు. ఈ శిబిరంలో తమ చక్కని శిక్షణ ఇవ్వడమే కాకుండా అనుమానాలు నివృత్తి చేయడం, ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వృత్తిపరంగా అవసరమైన మెళకువలపై అవగాహన కల్పించిన సిటిఎ నిర్వాహకులకు ఉద్యోగార్థులు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఇదే ప్రాంతంలో మరో రెండు ఉచిత శిబిరాలను ఎస్ ఎపి బిజినెస్ ఇంటెలిజెన్స్ పై నిర్వహించాలని సిటిఎ నిర్వహించిందని సంస్థ ప్రతినిధి రావు ఆచంట తెలిపారు.
ఈ శిక్షణ శిబిరాన్ని సమర్ధంగా నిర్వహించిన వెంకట్ నల్లబోతు, క్రాంతి పరుచూరి, సూర్యలకు సిటిఎ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో ఉన్న ప్రవాస భారతీయ ఉద్యోగార్థులకు చేయూతనిచ్చి, ధైర్యాన్ని, ఉద్యోగ సంపాదనకు అవసరమైన మెళకువలను నేర్పించిన ఈ శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయడంలో సిటిఎ బృందంలోని ప్రసాద్ తళ్ళూరు, శ్రీనివాస్ మంథెన, వేణు కొండూరు, ప్రసాద్ చండ్ర, రావు ఆచంట, వెంకట్ గ్యాజంగి, ప్రవీణ్ భూమన, లక్ష్మి తాతినేని చక్కని సమన్వయంతో కృషి చేశారు.
News Posted: 20 October, 2009
|