తానా బోర్డు సమావేశం

డల్లాస్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) డైరెక్టర్ల బోర్డు ఈ నెల 17, 18 తేదీల్లో సమావేశమైంది. డల్లాస్\ ఫోర్ట్ వర్త్ లో జరిగిన ఈ సమావేశంలో తానా భవిష్యత్తులో చేపట్టబోయే పలు కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. తానా డైరెక్టర్లతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, తానా ఫౌండేషన్ కు చెందిన సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశం ప్రారంభంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసింది. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో వరద బాధితులకు దుప్పట్లు, ఆహారపదార్థాలు తదితర అత్యవసర వస్తువులు అందరికన్నా ముందుగా అందించి సహాయ కార్యక్రమాలు చేపట్టింది తానాయే అని ఈ సందర్భంగా బోర్డు పేర్కొంది. వరద బాధితుల కోసం తానా సేకరిస్తున్న విరాళాలతో వరద బాధితులకు దీర్ఘకాల ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలతో త్వరలోనే ముందుకు వచ్చేందుకు తానా బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ మేనేజ్ మెంట్ టీమ్ (టీమ్ స్క్వేర్) తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డైరెక్టర్ల బోర్డు దాని పనుల తీరుపై సమీక్ష నిర్వహించింది. అమెరికాలోని తెలుగువారు మరణించిన, అగ్నిప్రమాదాలు, ఇతర ప్రమాదాల కారణంగా ఇబ్బందులు పడిన 25 పైగా తెలుగు టీమ్ స్క్వేర్ సభ్యులు సహాయ సహకారాలు అందించారు. ఆపదలో ఉన్న తెలుగు కుటుంబాలకు ఆదుకునే క్రమంలో వందలాది మంది టీమ్ స్క్వేర్ వలంటీర్లు కష్టపడి 1.50 లక్షల డాలర్లను విరాళంగా సేకరించారు. టీమ్ స్క్వేర్ వలంటీర్ల బృందానికి ఈ సందర్భంగా ఆటా బోర్డు డైరెక్టర్లు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తానా ప్రెసిడెంట్ జయరామ్ కోమటి మాట్లాడుతూ, ఉత్తర అమెరికాలోని తెలుగువారికి చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగంగా సాంఘిక సేవ, సాంస్కృతిక, విద్యా పరంగా తానా అనేకానేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. తానా ప్రచురణ కమిటీ చైర్మన్, తానా ట్రస్టీ డాక్టర్ చౌదరి జంపాల మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరికీ తెలుగు' కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష, సంస్కృతి ప్రచారానికి, తెలుగువారి పిల్లలు, యువత తెలుగు భాష నేర్చుకునేందుకు అవసరమైన వర్క్ పుస్తకాలు, మల్టీ మీడియా టూల్స్ లాంటి సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దీనితో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, ఆంకాలజీ లాంటి అన్ని రకాల ప్రత్యేక వైద్యులతో 'తానా ఫిజిషియన్స్ నెట్ వర్క్'ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని తెలుగు విద్యార్థులు, భారతదేశం నుంచి వచ్చే సందర్శకులకు ఉచితంగా మెడికల్ కౌన్సిలింగ్ అందించేందుకు తానా సభ్యులుగా ఉన్న వందలాది మంది ఫిజిషియన్లు ఇప్పటికే తమ సమ్మతిని తెలిపారన్నారు. ఈ నెట్ వర్క్ ను టానా ట్రస్టీ డాక్టర్ మణి అక్కినేని, తానా మెడికల్ సర్వీసెస్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ సాగర్ గుమ్మడి సమన్వయం చేస్తున్నారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్ టెక్స్) సంస్థ శనివారం సాయంత్రం నిర్వహించిన దీపావళి సంబరాల్లో తానా బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. తానా ప్రెసిడెంట్ ను టాన్ టెక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి సన్మానించారు. తానా బోర్డు డైరెక్టర్లను టాన్ టెక్స్ సభ్యులకు పరిచయం చేశారు. 2013 జూలై 4 నుంచి 6 వరకూ డల్లాస్ లో నిర్వహించే 19వ తానా కాన్ఫరెన్స్ లో నిర్వహణ బాధ్యతల్లో పాలు పంచుకోవాలని టాన్ టెక్స్ నిర్ణయించింది.
News Posted: 23 October, 2009
|