పిఎన్నారై ఫోరం దాతృత్వం న్యూయార్క్ : ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవలి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు పాలమూరు ఎన్నారై ఫోరం (పిఎన్నారై ఫోరం) బియ్యం, ఆహారపదార్థాలు, గృహోపయోగ సామగ్రి, దుస్తులు పంపిణీ చేసింది. దీనితో పాటుగా విద్యార్థులకు సుమారు 15 లక్షల రూపాయల విలువైన స్కూల్ బ్యాగ్, 6 నోటు పుస్తకాలు, 2 పెన్నులు, 2 పెన్సిళ్ళు, ఒక ప్లేట్, ఒక గ్లాసుతో కూడిన 2,500 కిట్లను పంపిణి చేసింది. వరదలో తీవ్రంగా నష్టపోయిన మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం చిన్నగుమ్మడం గ్రామంలో ఉన్నమొత్తం 64 కుటుంబాలకూ ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యం, 2 కేజీల పప్పు, కిలో మంచినూనె, ఒక చీర, లుంగీ, రుమాలు, ఒక దీపం, సామాన్లు భద్రపరుచుకునే డబ్బా, మసాలా దినుసులు అందజేసింది.
ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, పాలమూరు ఎన్నారై ఫోరం సభ్యుల దాతృత్వాన్ని ప్రశంసించారు. వరదల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన చిన్నగుమ్మడం గ్రామస్థుల నిత్య జీవితంలో అవసరమైన వస్తుసామగ్రిని, ఆహారపదార్థాలను అందజేయడం ముదావహం అన్నారు. అమెరికా స్థిరపడినప్పటికీ మాతృభూమిని మరిచిపోకుండా తమకు చేయూతనిచ్చిన పిఎన్నారై ఫోరానికి లబ్ధి పొందిన గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 23 October, 2009
|