ఉల్లాసంగా మహిళా సంబరాలు

న్యూజెర్సీ : ఉత్తర అమెరికాలోని తెలుగు వారి చరిత్రలో మున్నెన్నడూ జరగని రీతిలో యునైటెడ్ తెలుగు అమెరికన్ అసోసియేషన్ (యూటా) 'మహిళా సంబరాలు' వైభవంగా నిర్వహించింది. ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ లో అక్టోబర్ 25 ఆదివారం మధ్యాహ్నం 11.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సంబరాలు అత్యంత ఆహ్లాదకరంగా, ఉత్సాహపూరితంగా కొనసాగాయి. ఈ ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన తెలుగు మహిళలు 700 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రసంగించిన అతిథి వక్తలు ఆహూతులతో తమ తమ అనుభవాలను పంచుకున్నారు.
మహిళా సంబరాలు సందర్భంగా వివిధ వయస్సు గ్రూపు విభాగాల్లో యూటా సంస్థ నిర్వహించిన ఫ్యాషన్ షోలు, డ్యాన్స్ లు, ఆటల పోటీలలో మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. మహిళా సంబరాల్లో నిర్వహించి కార్యక్రమాలన్నీ అతిథులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా అతిథులకు 'బెస్ట్ డ్రెస్డ్ విమెన్ ఆఫ్ ద డే' అవార్డు యూటా అందజేసింది.

మహిళా సంబరాలు సందర్భంగా రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్ళను మహిళలు ఆసక్తిగా తిలకించారు. ఆభరణాలు, సాంప్రదాయ దుస్తులు, విలువైన రాళ్లు, పూలు, అలంకరణ సామగ్రి స్టాళ్ళను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. యూటా మహిళా సంబరాలు కార్యక్రమం విజయంతం అయ్యేందుకు కొద్ది వారాలుగా శ్రమించిన వలంటీర్ల బృందం కృషి చేసిందని, వారి కృషికి గుర్తింపుగా విజయాన్ని వారికే అంకితం చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. మహిళా సంబరాలకు హాజరైన ప్రతి ఒక్కరికీ నిర్వాహక కమిటీ ధన్యావాదాలు తెలిపింది.
News Posted: 30 October, 2009
|