'దేవులపల్లి'పై ప్రసంగ గోష్ఠి హ్యూస్టన్ : ప్రముఖ భావ కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి 113వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనతో పరిచయం ఉన్నవారితో గోష్ఠి నిర్వహిస్తున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో నవంబర్ 8 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ గోష్ఠి కార్యక్రమం ప్రారంభమవుతుంది. వంగూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్న 'నెలనెలా తెలుగు వెన్నెల' 21వ కార్యక్రమంగా జరిగే గోష్ఠిని వంగూరి ఫౌండేషన్ - త్యాగరాయ గానసభ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
దేవులపల్లి కృష్ణశాస్త్రితో ప్రత్యక్ష పరిచయం ఉన్న పాలగుమ్మి విశ్వనాథం, డాక్టర్ నిడమర్తి నిర్మలాదేవి, తురగా జానకీరాణి, పచ్చిపులుసు వెంకటేశ్వర్లు ఈ గోష్ఠిలో కృష్ణశాస్త్రితో తమకు ఉన్న అనుబంధంపై ప్రసంగిస్తారు. సభకు ముఖ్యఅతిథిగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, డాక్టర్ సి. నారాయణరెడ్డి హాజరవుతారు. శిరోమణి వంశీ రామరాజు అధ్యక్షత వహించే ఈ సభలో త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వేంకట దీక్షితులు ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటారు.
News Posted: 2 November, 2009
|