'గీతా' 30వ వార్షికోత్సవం

ఇండియానా పోలిస్ : గ్రేటర్ ఇండియానా పోలిస్ తెలుగు సంఘం (గీతా) 30వ వార్షిక వేడుకలు ఇండియానా పోలిస్ లోని ఫాల్ క్రీక్ హైస్కూల్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రవాసాంధ్రులు దీపావళి సంబరాలను కూడా వేడుకగా జరుపుకున్నారు. ప్రముఖ సినీ నటులు సంజన, శివారెడ్డి నృత్య ప్రదర్శన, శివారెడ్డి మిమిక్రీ, హాస్యనటులు గుండు హనుమంతరావు, అనంత్, నటి అపూర్వ ప్రదర్శించిన హాస్య నాటికలు ప్రేక్షకులను అలరించాయి. గాయకులు ప్రవీణ్, విజయలక్ష్మి ఆలపించిన గీతాలు ఆహూతులను ఉర్రూతలూగించాయి.
'గీతా' పూర్వ అధ్యక్షులను, సంఘం అభివృధ్ధికి తోడ్పాటు అందించిన సభ్యులను ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. వార్షిక వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో చిన్నారులకు ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

అమెరికా కాంగ్రెస్ అభ్యర్థి మెగాఫ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 'గీతా' తదుపరి కార్యవర్గాన్ని కూడా ఈ కార్యక్రమంలో ప్రకటించారు. గీతా సంస్థ తదుపరి అధ్యక్షునిగా పొణుగోటి అజయ్ ఎన్నికయ్యారు. 'గీతా' అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాయి పిన్నమనేని, ప్రభాకర్ కాశరడ, అవుతు సాంబిరెడ్డి, రాజు చింతల సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను గీతా అధ్యక్షుడు సుధీర్ తొండెపు, కార్యదర్శి చింతల రాము, కోశాధికారి హరీష్, విజయపాల్ రెడ్డి, సతీష్ గజ్జల, మంగారావు, దిలీప్ వడ్లమూడి, రఘు పాటిబండ్ల, సత్యనారయణ రెడ్డి, మోహన్ దేవరాజ్, పాతూరి శ్రీహరి, తుమ్ములూరి విద్యాసాగర్ తదితరులు పర్యవేక్షించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా సందీప్ పమ్మిరెడ్డి, అనుపమ చెంగల్వ వ్యవహరించారు.
News Posted: 5 November, 2009
|