విద్యార్థులకు పిఎన్నారై సాయం

మహబూబ్ నగర్ : ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవలి వరదల్లో బాగా నష్టపోయిన మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులకు అమెరికాలోని పాలమూరు ఎన్నారై ఫోరం చేయూత అందించింది. నవంబర్ 7 శనివారంనాడు పిఎన్నారై సంస్థ ప్రతినిధులు పది లక్షల రూపాయల విలువ చేసే రెండు వేల స్కూలు కిట్లను విద్యార్థులకు అందజేసింది. ఒక స్కూల్ బ్యాగ్, ఆరు పొడవు నోట్ పుస్తకాలు, రెండు పెన్నులు, రెండు పెన్సిళ్ళు, మధ్యాహ్న భోజనం పథకంలో లబ్ధిదారులైన విద్యార్థులకు ఒక స్టీలు కంచం, స్టీలు గ్లాసుతో కలిపి ఒక్కొక్క విద్యార్థికి అందజేసింది.

విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలోని గుమ్మడాం జిల్లా పరిషత్ హైస్కూల్ లో పిఎన్నారై ఫోరం ప్రారంభించింది. గుమ్మడాం, చిన్న గుమ్మడాం, తాండ, యాపర్ల, అయ్యవారిపల్లె, వెల్టూరు, బెక్కెం, పెద్దమరూరు గ్రామాలతో పాటు అలంపురం, మానోపాడ్ మండలాల్లోని మరికొన్ని గ్రామాల విద్యార్థులకు పిఎన్నారై సంస్థ స్కూలు కిట్లను అందజేసింది. పిఎన్నారైలు చేసిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు హర్షామోదాలతో అభినందించారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృభూమిని మరిచిపోకుండా నిరంతరం సేవలు అందిస్తున్న పాలమూరు ఎన్నారై సంస్థ నిర్వాహకులు, సభ్యులను స్థానికులు ప్రశంసించారు. స్కూలు కిట్లు అందుకున్న విద్యార్థులు సంతోషంతో గంతులు వేశారు. వరద బాధిత ప్రాంతాల్లోని మరి కొన్ని పాఠశాలల విద్యార్థులకు కూడా సహాయం చేయాలని పిఎన్నారై ఫోరం కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
News Posted: 8 November, 2009
|