'పాలమూరు' విసికి సన్మానం

న్యూజెర్సీ : ఆర్థికంగా బాగా వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 'పాలమూరు విశ్వవిద్యాలయా'న్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ వర్శిటీ ఉప కులపతి (వైస్ చాన్స్ లర్) ప్రొఫెసర్ వి.గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయంలో అమెరికాలో స్థిరపడిన పాలమూరు ఎన్నారైలు మరింత చురుగ్గా ముందుకు కదలాలని ఆయన పేర్కొన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులను సేకరించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ప్రొఫెసర్ రెడ్డి న్యూజెర్సీ వచ్చిన పాలమూరు ఎన్నారై ఫోరం (పిఎన్నారై ఫోరం) సోమర్ సెట్ లో ఘనంగా సన్మానించింది. ఈ సన్మానసభకు హాజరైన పారమూరు ఎన్నారై ఫోరం సభ్యులను, అమెరికా పర్యటనకు వచ్చిన వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు.
పాలమూరు విశ్వవిద్యాలయం క్యాంపస్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ పట్టణంలో ఇటీవలే 187 ఎకరాల భూమిని కేటాయించింది. సంవత్సరం క్రితమే ప్రొఫెసర్ రెడ్డిని విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా నియమించింది. అప్పటి నుంచి వర్శిటీ అభివృద్ధి కోసం ప్రొఫెసర్ రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.
ప్రొఫెసర్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వర్శిటీలో ఇప్పటి వరకూ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, మేథమేటిక్స్, ఎంబిఎ, ఎంసిఎ సహా 14 రకాల కోర్సులు చేసేందుకు 850 మంది విద్యార్థులు నమోదయ్యారని పేర్కొన్నారు. తాజాగా స్కూల్ ఆఫ్ ఫార్మసీ కోర్సు కూడా ఈ జాబితాలో చేరిందన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలోని వరద బాధితులకు పాలమూరు ఎన్నారై ఫోరం అందించిన సహాయాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా పాలమూరు విశ్వవిద్యాలయానికి ఆర్థికంగా, విద్యా పరంగా సహాయ సహకారాలు అందించాలని పిఎన్నారై ఫోరంను ఆయన అభ్యర్థించారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలతో పాలమూరు వర్శిటీకి కొలాబరేషన్ కోర్సుల ఏర్పాటు విషయంలో పిఎన్నారైలు తోడ్పాటు అందించాలని కోరారు. పాలమూరు విశ్వవిద్యాలయాన్ని పిఎన్నారైలు సందర్శించి విద్యార్థులు, అధ్యాపకుల్లో చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు.
ఆర్థిక మాంద్యం కారణంగా ఈ విద్యా సంవత్సరంలో వర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ లో 25 శాతం కోత పెట్టిందని ప్రొఫెసర్ రెడ్డి వెల్లడించారు. లైబ్రరీ, హాస్టల్, లెక్చర్ హాల్ లాంటి సౌకర్యాలను పిఎన్నారైలు స్పాన్సర్ చేయాలని ప్రొఫెసర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాంతారెడ్డి, దయాసాగర్ రావు కూడా పాల్గొన్నారు. పాలమూరు జిల్లా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారంతా పాలమూరు ఆర్గ్ వెబ్ సైట్ ను సందర్శించాలని, పిఎన్నారై ఫోరంలో చేరి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఫోరం చేస్తున్న కార్యక్రమాల్లో చేయూతనివ్వాలని ఫోరం నిర్వాహకులు కోరారు.
News Posted: 10 November, 2009
|