బాధితులకు లక్ష డాలర్ల సాయం

టెక్సాస్ : ఇటీవలి ఆంధ్రప్రదేశ్ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం టాంటెక్స్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్), తానా, ఆటా, గ్రేట్ ఆంధ్రా ఫౌండేషన్, అప్నా ఫౌండేషన్ ద్వారా దాతలు సుమారు లక్ష డాలర్లు అందజేసినట్లు టాంటెక్స్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కొర్సపాటి పేర్కొన్నారు. విరాళాలు అందజేసిన దాతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సహాయనిధిని వరద బాధితులకు శాశ్వత పునరావాస కల్పనకు వినియోగిస్తామని ఆయన వెల్లడించారు. తానా, ఆటా సంస్థలతో సంయుక్తంగా టాంటెక్స్ సంస్థ నవంబర్ 7వ తేదీన ప్రిస్కోలోని సెంటెన్నియల్ హైస్కూల్ లో నిర్వహించిన హాస్యవల్లరి, సంగీత విభావరి కార్యక్రమంలో శ్రీధర్ మాట్లాడారు. ఈ కార్యక్రమాలను వరద బాధితులకు విరాళాల సేకరణ కోసం నిర్వహించారు. సుమారు 500 మంది తెలుగువారు ఈ విరాళాల సేకరణ హాస్యవల్లరి, సంగీత విభావరి కార్యక్రమానికి హాజరయ్యారు.
సరిగమ భోజనశాల యాజమాన్యం అందించిన రుచికరమైన విందు భోజనంతో కార్యక్రమం ప్రారంభమైంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా అలంకరించిన ప్రాంగణంలో చిన్నారు ధీర, రచన, ధీమంత్ అమెరికా జాతీయగీతం ఆలపించారు.
ప్రముఖ హాస్యనటులు గుండు హనుమంతరావు, అనంత్, క్యారెక్టర్ నటి అపూర్వ చేసిన అద్భుతమైన హాస్యవల్లరి కార్యక్రమం ఆహూతులందరినీ కడుపుబ్బ నవ్వించింది. ప్రముఖ గాయని విజయలక్ష్మి తన గాన మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని అలరించేలా జనరంజకమైన పాత - కొత్త పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ తమ సంస్థల తరఫున తానా ప్రాంతీయ డైరెక్టర్ మురళి వెన్నం, ఆటా ప్రాంతీయ కో ఆర్డినేటర్ సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తానా కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, కోశాధికారి రామ్ యలమంచిలి, ఆటా ప్రతినిధులు, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు కళాకారులను జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. టాంటెక్స్ సంయుక్త కోశాధికారి సుభాష్ నెలకంటి వందన సమర్పణ చేయడంతో పాటు ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన వారికి, వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
చివరిగా హాస్యనటులు, గాయని విజయలక్ష్మి, ప్రేక్షకులందరూ కలిసి భారత జాతీయగీతం ఆలపించడంతో హాస్యవల్లరి, సంగీత విభావరి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
News Posted: 11 November, 2009
|