నంద్యాల మహిళ మృతి

కాలిఫోర్నియా : కుమార్తె ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ 54 సంవత్సరాల మహిళ రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన పలువురిని కలచివేసింది. ఉత్తర కాలిఫోర్నియా రాష్ట్రంలోని మారిస్ విల్లేలో మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. కుమార్తె ఇంటికి ఐదు నెలల క్రితం వచ్చిన కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన సుబ్బలక్ష్మమ్మ పల్లె (54)ను ఓ కారు ఢీకొంది. సమీపంలోని కుమార్తె ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సుబ్బలక్ష్మమ్మను రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీనితో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమెకు భర్త బోరెడ్డి, కుమార్తె శశికళాదేవి, కుమారుడు బోగేశ్వరరెడ్డి ఉన్నారు. మరో పది రోజుల్లో ఆమె తన సొంత ఊరికి వెళ్ళిపోనున్నారు.
సుబ్బలక్ష్మమ్మ మృతికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జయరాం కోమటి, తానా టీమ్ స్క్వేర్ కమిటీ చైర్ పర్సన్ శ్రీనివాస్ వల్లూరుపల్లి, కార్యదర్శి మోహన్ నన్నపనేని, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర తీవ్ర సంతాపం ప్రకటించారు. సుబ్బలక్ష్మమ్మ మృతదేహాన్ని నంద్యాల పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లను వారు చేస్తున్నారు.
News Posted: 9 December, 2009
|