మినీ షిర్డీగా నెమ్లి సాయి గుడి

న్యూజెర్సీ : నిజామాబాద్ జిల్లా నెమ్లి వద్ద ప్రవాసాంధ్రుడు మోహన్ పటలోళ్ళ నిర్మించిన షిర్డీ సాయి మందిరం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గత మార్చి నెలలో నిర్మాణం పూర్తిచేసుకొన్న ఈ సాయి మందిరం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 'మినీ షిర్డీ'గా భాసిస్తోంది. మరో వైపున ప్రారంభమైన ఆరు నెలల్లోనే నెమ్లి సాయి మందిరానికి భక్తుల రద్దీ బాగా పెరగడంతో మంచి పర్యాటక కేంద్రంగా కూడా మారింది.
అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన మోహన్ పటలోళ్ళ మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న నెమ్లి గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. నెమ్లి సాయిబాబా దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో తరలివస్తున్నారు.
ఈ ఆలయ ప్రాంగణంలో 'ద్వారకామాయి', 'నవగ్రహ' ప్రతిష్ఠాపన కార్యక్రమాలను గత నవంబర్ 27న వైభవంగా నిర్వహించారు. ఊహించని విధంగా అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని, నంది అవార్డు గ్రహీత సునీత, సూపర్ సింగర్ ఫేమ్ శ్రీకృష్ణ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ఆలయం నిర్మాత మోహన్ పటలోళ్ళ మాట్లాడుతూ, మానవత్వంపై సాయిబాబా చేసిన ప్రవచనాలను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రచారం చేయాలన్న తన చిరకాల స్నప్నం తీరిందన్నారు.
News Posted: 9 December, 2009
|