తెలంగాణ ఎన్నారైల వేడుక

న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన హర్షం వ్యక్తం చేస్తూ న్యూజెర్సీ ఫోర్డ్స్ లోని రాయల్ ఆల్బర్ట్ ప్లేస్ లో వేడుకలు జరుపుకున్నారు. దాదాపు వంద మంది ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధి వేదిక (టిడిఎఫ్) యుఎస్ఎ చైర్మన్ సుధాకర్ పేర్కారి ఈ సందర్భంగా విద్యార్థులకు, మేధావులకు, తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను వేగిరపరచవలసిందిగా భారత ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందు టిడిఎఫ్ ఉపాధ్యక్షుడు మురళి చింతల్ పాని సభికులకు స్వాగతం పలికి ఇటీవల తాను హైదరాబాద్ లో జరిపిన పర్యటన వివరాలను తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల ప్రజలు ఎలా పాల్గొన్నదీ ఆయన వివరించారు. తొలుత 'జై తెలంగాణ' గీతాన్ని రాజ్ శీలం ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరువాత ట్రస్టీ రవి ధన్నపునేని ఇండియా నుంచి వచ్చిన అతిథి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ ను సభికులకు పరిచయం చేశారు. రాజేశ్వర్ గౌడ్ తన ప్రసంగంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత గురించి వివరించారు.
ఆలస్యంగానైనా కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాన్నే తీసుకున్నందుకు తెలంగాణ ఎన్ఆర్ఐలు హర్షం వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి మకుటాయమానం కాగలదని, దేశాన్ని మరింత పటిష్ఠం చేయగలదని తెలంగాణ ఎన్ఆర్ఐలు విశ్వసిస్తున్నారు. ఈ రాష్ట్రం ఏర్పాటు వల్ల ఆంధ్ర జిల్లాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని, అవి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందగలవని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ వేడుకలకు ప్రముఖ తెలంగాణ ఎన్ఆర్ఐలు ప్రవీణ్ తక్కలపల్లి, నళినీధర్, మోహన్ దంద, ప్రవీణ్ మిట్ట, శ్రీనివాస్ మామిడి, వినయ్, యశ్వీర్ రెడ్డి, హరనాథ్, శంకరరావు, రవీంద్ర రెడ్డి, డి.ఆర్. అజయ కట్టా, నారాయణ పీర్లమర్ల, రాజ్ శీలమ్, విజయ్ కుందూరు, రాజేశ్వర్ గంగసాని, వినోద్ రెడ్డి, తిలక్, లక్ష్మణ్ రెడ్డి, విశాల్ హాజరయ్యారు.
News Posted: 14 December, 2009
|