అమెరికాలో సమైక్యాంధ్ర సభ

మిల్పిటస్ (కాలిఫోర్నియా) : ఎవరినీ సంప్రతించకుండా, ఆఖరికి ముఖ్యమంత్రికి కూడా తెలియనీయకుండా అర్ధరాత్రి హడావుడిగా చేసిన తెలంగాణా ప్రత్యేక ప్రకటన ప్రకంపనలు అమెరికాను కూడా తాకాయి. 'సమైక్యాంధ్ర ప్రదేశ్ ప్రగతికి సంకేతం' అని సుమారు అయిదు వందల మంది ప్రవాసాంధ్రులు అమెరికా సిలికాన్ వేలీలో గొంతెత్తి చాటారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రవాసాంధ్రులు కాలిఫోర్నియా మిల్పిటస్ నగరంలో డిసెంబరు 13 ఆదివారం, సెర్రా థియేటర్స్ ప్రాంగణంలో 'సమైక్యాంధ్రప్రదేశ్' కి మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ పై ఒక తీర్మానాన్ని ఈ సభలో ప్రవేశపెట్టారు.
రాజకీయ అవకాశవాదాన్ని ఆసరాగా తీసుకొని తెలుగువారి మధ్య విభేదాలు, విద్వేషాలను సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఆవేశపూరితంగా ప్రసంగించిన పలువురు వక్తలు దుయ్యబట్టారు. వెనుకబాటుతనానికి వేర్పాటు వాదాలు పరిష్కారం కాదనీ, అవి అభివృద్ధి వైపునకు తీసుకెళ్ళలేవని ఆవేదనతో అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే తెలుగువారి ప్రగతే ముక్కలయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధించడం సులభతరం అవుతుందన్న అభిప్రాయాన్ని ఏకగ్రీవంగా వ్యక్తీకరించారు.
మన పూర్వీకుల నిస్వార్థ త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయనీ, పొట్టి శ్రీరాములు అకుంఠిత దీక్ష వలన ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు బలిచేయడం శ్రేయస్కరం కాదని అందరూ ముక్తకంఠంతో ఖండించారు. కంప్యూటర్ సాంకేతిక రంగంలో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందనీ, ఆ విజయం తెలంగాణా, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారందరిదీ అని గుర్తు చేశారు. హైదరాబాద్ అన్ని ప్రాంతాల వారి సంస్కృతీ, ప్రగతులకీ చిహ్నమనీ, అది ముందు తరాల వారికి స్ఫూర్తిని కలిగించే విధంగా రూపుదిద్దుకుందని అన్నారు.
పలు విద్యా సంస్థలూ, ప్రపంచంలోని పలు టెక్నాలజీ కంపెనీలూ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయన్నారు. శాంతి భద్రతలూ, అస్థిర రాజకీయ వాతావరణం వల్ల హైదరాబాదే నష్టపోతుందన్న ఆవేదనను వారంతా వ్యక్తం చేశారు. మనకి రావాల్సిన పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం ప్రస్తుత విద్యార్థులపై పడుతుంది. పరోక్షంగా నిరుద్యోగ సమస్యకు దారితీస్తుందన్నారు.
హడావుడిగా అర్ధరాత్రి చేసే నిర్ణయాల వల్ల కలిగిన అనర్ధమిది అని పలువురు వక్తలు ఈ సందర్భంగా భారత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందనీ అందరూ ఆవేదన చెందారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ప్రగతి చెక్కలవుతుందని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న భారత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సమైక్యాంధ్రప్రదేశ్ సభను భక్త భల్లా, చైతన్యరెడ్డి, వెంకట్ మద్దిపాటి, శ్రీనివాస్ వేముల, సతీష్ అంబటి, తులసి తుమ్మల, శ్రీకాంత్ కోనేరు నిర్వహించారు.
News Posted: 14 December, 2009
|