ప్రవాసుల సమైక్యాంధ్ర పోరు

వాషింగ్టన్ : సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వాషింగ్టన్ డి.సి. క్యాపిటల్ సిటీలోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్రవాసాంధ్రులు ఆందోళన నిర్వహించారు. అమెరికా పార్లమెంట్, సుప్రీం కోర్టుకు కూతవేటు దూరంలోనే గాంధీ విగ్రహం ఉంది. క్యాపిటల్ పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా స్థానిక నాయకులు వేమన సతీష్, డాక్టర్ యండ్ల హేమప్రసాద్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నరేంద్ర రెడ్డి ఏలూరు, త్రిలోక్ కంతేటి, ప్రవీణ్ కొండక, ప్రదీప్ గౌరినేని ఆధ్వర్యంలో ఈ ఆందోళ జరిగింది. మైనస్ 3 డిగ్రీల చలిలో, మంచు తుపాన్ కురుస్తున్నా, ఎముకలు కొరికే చలిగాలిని లెక్క చెయ్యకుండా ప్రవాసాంధ్రులు సమైక్యాంధ్ర ఆందోళన కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు.

ఆందోళకారులు ముందుగా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఆంధ్రప్రదేశ్ ముక్కలవ్వకుండా చెయ్యమని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వేమన సతీష్ మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న ఆరు లక్షల మంది తెలుగు ప్రజలు సమైక్యాంధ్ర కావాలని కోరుకుంటున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమంలో తానూ ఓ కార్యకర్తననీ, తెలుగు వారందరూ కలిసిమెలసి ఉండాలన్నదే తమ నినాదమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యనీయమన్నారు. డాక్టర్ యండ్ల హేమప్రసాద్ మాట్లాడుతూ, కొందరు కరుడుగట్టిన వేర్పాటువాదుల వల్లే ప్రస్తతం రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, తెలుగుజాతి చరిత్ర మూడు వేల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిందని తెలిపారు. డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితులలోనూ ఆంధ్రప్రదేశ్ ను విభజించరాదని కోరారు.
ఈ సందర్భంగా భారత రాయబారి మీరా శంకర్ కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రికి, ప్రత్యేకంగా మెమోరాండాలు సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కిశోర్ చెన్నుపాటి, శ్రీనివాసుల రెడ్డి, కృష్టమోహన్ బొప్పన, సుబ్బారావు కొల్లా, డాక్టర్ నరేన్ కొడాలి, ఆనంద్ మెకాటి, ఈశ్వర్ గదే, కృష్టమోహన్ సూరపనేని, మధు చెల్లం సమైక్యాంధ్ర ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
News Posted: 15 December, 2009
|