చికాగోలో సమైక్యాంధ్ర సభ

చికాగో : ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేయవద్దంటూ, సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ చికాగో నగరంలోని తెలుగు వారంతా సమైక్య సమావేశం నిర్వహించారు. చికాగోలోని అరోరా బాలాజీ ఆలయంలో డిసెంబర్ 13న వీరంతా సమావేశమై సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా నెలకొన్న అవాంఛనీయ సంఘటనల గురించి చికాగోలోను, చుట్టుపక్కల ఉన్న తెలుగువారందరికీ వివరించడం, చర్చించడం, అభిప్రాయాలను పంచుకోవడం, కార్యాచరణ, తెలుగు ప్రజల సమైక్యత కోసం నిర్వహించాల్సిన కార్యక్రమాలు అనే ప్రధాన అంశాలు ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించడం ప్రధానోద్దేశంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలవారిలోనూ ఏకత్వాన్ని, సోదరభావాన్ని చాటేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ భావాల ప్రచారం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఏ ప్రాంతానికీ సానుకూలత గాని, వ్యతిరేకత గాని వ్యక్తం చేయకుండా తెలుగువారి ఐక్యత కోసం కృషిచేయాలని సమావేశం నిర్ణయించింది. చికాగో సమైక్యాంధ్ర తెలుగు వారి సమావేశం సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అనంతరం సమన్వయ కమిటీ వచ్చే సలహాలు, అభిప్రాయాలను సేకరించాలని సమావేశం నిశ్చయించింది. తెలుగువారందరూ ఉండేలా చేసేందుకు అవసరమైన భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశం ఏ ప్రాంతానికీ, రాజకీయ పార్టీకి మద్దతుగా గాని, వ్యతిరేకంగా గాని నిర్వహించలేదని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల ప్రజల మధ్య సోదరభావానికి దూరం కాకూడదని, అందరం ఒక్కటే అన్న అభిప్రాయాన్ని పెంపొందించుకోవాలన్న సందేశాన్ని ప్రచారం చేయడానికే సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
News Posted: 15 December, 2009
|